పుట్టపర్తి అర్బన్: వ్యవసాయ శాఖలోని మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (ఎంపీహెచ్‌ఈఓలు) సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20వ తేదీ నుంచి విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్యకు సమ్మెనోటీసు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో కేవలం రూ.12 వేల జీతం, రూ.3 వేల ఇన్సెంటివ్‌తో 12 ఏళ్లుగా పని చేస్తున్నా.. ఇప్పటి వరకూ జీతాల పెంపులేదని, ఉద్యోగ భద్రత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అందుకే ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకూ సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నెలకు రూ.35 వేల వేతనంతో పాటు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే నాన్ శాంక్షన్ పోస్టు నుంచి శాంక్షన్ పోస్ట్‌కు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు చెన్న నాయక్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, కార్య నిర్వాహక కార్యదర్శులు మీన, గంగరాజు, కార్యవర్గ సభ్యులు రామ్మోహన్, జయరాం, మారుతి, లోక్ష్మీబాయి, భాగ్య, ముబీనా, రాజేశ్వరి, అరుణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో భారీ చోరీ
ధర్మవరం అర్బన్: పట్టణంలోని రంగా సినిమా థియేటర్ సమీపంలోని ఎరుకల మీనాక్షి ఇంట్లో దొంగలు పడి రూ.4.50 లక్షలు నగదు, నాలుగు బంగారు, వెండి ఉంగరాలు ఎత్తుకెళ్లారు. వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని రంగా సినిమా థియేటర్ పక్కనున్న రెండో వీధిలోని ఎరుకల మీనాక్షి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి పెనుకొండ దగ్గరున్న కొండపల్లికి వెళ్లారు. శుక్రవారం రాత్రి ధర్మవరానికి వచ్చి ఇంటి తలుపులు తీయగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ.4.50లక్షల నగదు, బంగారు ఉంగరాలు, వెండి ఉంగరాలను ఎత్తుకెళ్లారు. వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
న్యాయమైన డిమాండ్ల సాధనకు 20వ తేదీ నుంచి
విధుల బహిష్కరణ
డీఏఓకు సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగులు


