బత్తలపల్లి: దైవదర్శనానికి వెళ్తుండగా కారు వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న లారీని ఢీ కొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వేల్పుమడుగు క్రాస్ వద్ద అనంతపురం–కదిరి జాతీయ రహదారి శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా శ్రీనివాసపురానికి చెందిన మంజునాథ కారులో ఆయన స్నేహితులు భాస్కర్, నరసింహప్ప, చరణ్, ధనుష్, శ్రీకాంత్, కారు డ్రైవర్ కృష్ణారెడ్డి గురువారం బయల్దేరి మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కదిరి వెళ్తుండగా .. కారు బత్తలపల్లి జాతీయ రహదారి బైపాస్‌లో వేల్పుమడుగు క్రాస్ వద్ద ముందు వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వెనుకవైపున ఢీకొనింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను తగిలి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ సమయంలో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అందులోని భాస్కర్, నరసింహప్ప, ధనుష్, కారు డ్రైవర్ కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. బత్తలపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన పెనుప్రమాదం
నలుగురికి తీవ్రగాయాలు


