పుట్టపర్తి టౌన్: పుట్టపర్తిలో ప్రమాదాల నివారణకు పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు భార్యాభర్తల మృతికి కారణమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బోయ నరేంద్రబాబు (40), బోయ లత (37) శుక్రవారం మృతిచెందారు. వివరాలు.. ఇటీవల పుట్టపర్తి అర్బన్ పోలీస్టేషన్ సీఐ యువరాజు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పట్టణ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రహదారిపై వాహనాల వేగనియంత్రణకు డ్రమ్ములు వేయించారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామానికి చెందిన బోయ నరేంద్రబాబు, భార్య లత సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు ముగించుకొని సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుతున్న తమ పిల్లల వద్దకెళ్లి ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో సత్యసాయి సూపర్ ఆసుపత్రి నుంచి పుట్టపర్తికి వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు కనిపించక ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న నరేంద్రబాబు, లత దంపతులు కిందపడిపోయారు. బలమైన గాయాలతో పడి ఉన్నవారిని చికిత్స నిమిత్తం సత్యసాయి సూపర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. రెండు రోజుల పాటు బెంగళూరులో మృత్యువుతో పోరాడి శుక్రవారం మృతిచెందారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ యువరాజ్ కేసు నమోదు చేశారు.
పుట్టపర్తిలో వేగ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములు
తరచూ ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు


