పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి
ప్రశాంతి నిలయం: ‘పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి సాధ్యం. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలి’ అని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ అఽధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ సమీక్షించి, వాటికి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 12 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. వాటి ద్వారా రూ.6,175 కోట్ల పెట్టుబడులతో 13,426 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన 3,835 ఎకరాల భూమి కేటాయింపులు, ఇతర అనుమతులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, డీఆర్‌ర్డీఏ పీడీ నరసయ్య, ఏపీఐఐసీ అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
26న దివ్యాంగుల ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ
జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత విభాగం అధికారులతో కలసి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


