కదిరి: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు వివిధ రూపాల్లో సాక్షాత్కరించారు. ఇందులో ఒకటి నారసింహుడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన హిరణ్య కశ్యపుడిని అంతమొందించేందుకు సగం మనిషి, సగం సింహ రూపంలో అవతరించిన నారసింహుడుని కంబాల రాయుడు అని కూడా భక్తులు పిలుస్తుంటారు. కంబం అంటే స్తంభం. స్తంభం నుంచి ఉగ్రరూపంతో భువిపైకి వచ్చిన నారసింహుడు.. హిరణ్య కశ్యపుడిని అంతమొందించిన తర్వాత గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై అవతరించారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఇందుకు అక్కడి కొండపై స్వామి పాదాలు వెలిసినట్లు పురాణాలు సైతం చెబుతున్నాయి. ఇదే కొండపై శ్వేద తీర్థం, శిద్దుల దొన ఉన్నాయి. ఎన్ని కరువు కాటకాలొచ్చినా నీరు ఇంకి పోకుండా ఉండడం ఈ దొనల ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. వారు తమ ఇలవేల్పుగా లక్ష్మీనరసింహస్వామి కొలిచేవారు. అందుకే వీరి కుటుంబీకులు కదిరి ప్రాంతంలో ఎంతోమంది కంబన్న, కంబాలమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు గొడ్డువెలగల నుంచి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తుంటారు.
కంబాలరాయుడే కాటమరాయుడు
కంబాలరాయుడే కాటమరాయుడు