పెళ్లి మండపంలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

పెళ్లి మండపంలో భారీ చోరీ

Jun 3 2023 12:20 AM | Updated on Jun 4 2023 5:27 AM

- - Sakshi

ఆడబిడ్డ పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును దొంగ దోచుకెళ్లిన ఘటన

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఆడబిడ్డ పెళ్లికి ఖర్చు చేయాల్సిన సొత్తును దొంగ దోచుకెళ్లిన ఘటన అనంతపురం నగర శివారుల్లోని నీలం రాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో గురువారం చోటు చేసుకుంది. నాల్గవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడుకు చెందిన బిళ్లేనారాయణస్వామి కుమార్తెని, వేపకుంటకు చెందిన సోమన్న కుమారుడు (ప్రస్తుతం తిరుమలలో వైద్యుడు)కి ఇచ్చి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా అనంతపురం శివారుల్లోని నీలంరాజశేఖరరెడ్డి కల్యాణ మండపంలో మే 31 ముహూర్తం కాగా 1న తలంబ్రాలు జరిగాయి.

గురువారం పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు, మిత్రులు నూతన వధువరులకు తెచ్చిన బహుమతులను వధువు తల్లిదండ్రులు ఓ గదిలోకి సర్దుతున్నారు. ఈ సమయంలో బిళ్లే నారాయణస్వామి తన చేతిలో ఉన్న రూ.7.50 లక్షలతో పాటు రెండు తులాల బంగారు నగలున్న బ్యాగును వారికి కేటాయించిన సేఫ్టీ గదిలో దాచారు. అదే గదిలో వధువుకు వచ్చిన గిఫ్ట్‌లను ఓ పక్కకు సర్దారు. తీరా డబ్బున్న బ్యాగు వైపు చూడగా అది కనిపించలేదు.

దీంతో అనుమానం వచ్చి కల్యాణ మండపం మొత్తం గాలించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆ గదిలోంచి బయటకు వచ్చినట్లు తోటి వారు చెప్పడంతో తెలుసుకున్న బాధితులు విషయాన్ని నాల్గవ పట్టణ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. కాగా ఓ వ్యక్తి మండపం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. అతనే దొంగా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లికి ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు మాయం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.

దొంగల జాబితాతో..
కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడే దొంగల జాబితాను వెలికి తీసిన పోలీసులు దొంగను పట్టుకునేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. గతంలో ఇలాంటి నేరాలతో సంబంధాలున్న వారిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. కల్యాణ మండపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి ఫొటోను సేకరించారు. ఈ ఫొటో ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement