● జేడీఎం లిఖిత
నెల్లూరు(పొగతోట): నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని జేడీఎం లిఖిత స్కందు అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని ధనలక్ష్మీపురంలో ఉన్న శిక్షణా కేంద్రంలో అభ్యర్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీడాప్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. శిక్షణా కేంద్రాల్లో కంప్యూటర్ ల్యాబ్, డొమైన్ ల్యాబ్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగులు తమ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండాలన్నారు. అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారికి వెల్కమ్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనర్లు, శిక్షణా కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.


