● వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యానికి
నిండు గర్భిణి మృతి
వాకాడు: వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలైంది. మండలంలోని బాలిరెడ్డిపాళెం ఆముదాలపాడు దళితవాడకు చెందిన ఎంబేటి చెంగమ్మ (41) తొమ్మిది నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం రాత్రి 11 గంటలకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తొలుత వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడి నుంచి గూడూరుకు తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం సకాలంలో అందకపోవడంతో నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చెంగమ్మ తీవ్ర అస్వస్తతకు గురై కడుపులోని శిశువుతో సహా మృతిచెందింది. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు అందాల్సిన వైద్యసేవలు, ప్రసవ సమయంలో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతోనే నిండు గర్భిణి మృతి చెందిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ఆస్పత్రిలో ఉంచారని, ఆదివారం పంచనామ అనంతరం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు బంధువులు తెలిపారు.


