● అన్న మరణం తట్టుకోలేక మృతి
● అంత్యక్రియలు రోజున ఘటన
పొదలకూరు: సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అంత్యక్రియలకు హాజరైన సోదరి తన అన్న మరణం తట్టుకోలేక కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారకమైన ఘటన పొదలకూరు మండలం బిరదవోలు చెర్లోపల్లిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చెర్లోపల్లి గ్రామానికి చెందిన నాగేళ్ల ప్రభాకర్‌నాయుడు (65) శుక్రవారం ఉదయం బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మనుబోలు మండలం, వడ్లపూడి పంచాయతీ గొట్లపాళెం గ్రామానికి చెందిన విమలమ్మ (50) ఆయనకు సోదరి. ఐదుగురు సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌నాయుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునే వారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన సోదరి అన్న మరణం తాళలేక గుండెల్లో నొప్పి వచ్చి కుప్పకూలారు. వెంటనే ఆమెను హుటాహుటిన పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. బంధువులు విమలమ్మ మృతదేహాన్ని స్వగ్రామం గొట్లపాళేనికి తరలించారు. అన్నా చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. చెర్లోపల్లి, గొట్లపాళెం గ్రామాలలో విషాదఛాయలు అలముకున్నాయి.


