● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారని, ఈ సమయంలో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రి లేదా ట్రామా కేర్ సెంటర్‌కు చేర్చి వారి ప్రాణాలను కాపాడిన వారికి నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారని వివరించారు. ఒక రోడ్డు ప్రమాద ఘటనలో గరిష్టంగా ఐదుగురు సహాయకులకు ప్రోత్సాహకాన్ని అందించే అవకాశం ఉందన్నారు. ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు సహాయకుడి వివరాలను ఆస్పత్రి నమోదు చేస్తుందని తెలిపారు. అనంతరం సంబంధిత పోలీసులు ప్రమాద వివరాలను పరిశీలించి, అర్హతను నిర్ధారించి జిల్లా రహదారి భద్రత విభాగం, రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపిస్తారని వివరించారు. జిల్లా రవాణా అధికారి ద్వారా కలెక్టర్‌కు సిఫార్సు చేయగా, ఆమోదం తర్వాత నిబంధనల ప్రకారం నగదు ప్రోత్సాహకాన్ని సహాయకుడి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారని పేర్కొన్నారు.


