చెరువులను కుళ్లబొడిచి.. మట్టిని కొల్లగొట్టి | - | Sakshi
Sakshi News home page

చెరువులను కుళ్లబొడిచి.. మట్టిని కొల్లగొట్టి

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

ఉదయగిరి: చంద్రబాబు పాలనలో కూటమి నేతలు సహజ వనరుల దోపిడీకి తెగబడుతున్నారు. ఇసుక, మట్టి, తెల్లరాయి, బైరెటీస్‌ తదితర ప్రకృతి సంపదను కొల్లగొడుతూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. వీరి అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతూ బరితెగిస్తున్నారు. ప్రధానంగా చెరువులను కుళ్లబొడిచి మట్టి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని ఆరికట్టాల్సిన ఇరిగేషన్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ మౌనవ్రతం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డూ అదుపు లేకుండా..

ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులను చెరబట్టి కుళ్లబొడిచేస్తున్నారు. నియోజకవర్గంలోని అనేక మండలాల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నా.. కలిగిరి, వింజమూరు మండలాల్లో ఈ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. చెరువుల్లో యంత్రాలను ఏర్పాటు చేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు మట్టిని తరలిస్తున్నారు. కలిగిరి మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మండలాధ్యక్షుడు స్థానికంగా ఉన్న చెరువులు, సోమశిల ఉత్తర కాలువ కట్టల మట్టిని గృహల పునాదులు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ప్లాట్లకు అక్రమంగా తరలిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. వింజమూరు మండల కేంద్రంలోని పాతూరు, యర్రబల్లిపాళెం, మలపరాజు వాగుతో పాటు ఇరిగేషన్‌ డొంక భూములు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పక్కనున్న ప్రభుత్వ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తంతు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ప్రమేయంతోనే స్థానిక నేతలు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు వ్యతిరేకంగా..

కలిగిరి పెద్ద చెరువులో యంత్రాలతో 10 నుంచి 15 అడుగుల మేర గోతులు తీసి మట్టి తరలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు చేస్తున్నారనే విషయం తెలిసినా అధికారులు నోరు మెదపడం లేదు. దుత్తలూరు మండలం ముత్తరాశిపల్లి, నందిపాడు చెరువుల్లోనూ మట్టి తరలింపుతో భారీ గోతులు ఏర్పడ్డాయి. దుత్తలూరు నుంచి ఉదయగిరి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల్లో సైతం భారీ గోతులు తీసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఉదయగిరి, వెంకట్రావుపల్లి, చెరువుపల్లి చెరువుల్లో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వింజమూరు మండంలోని పలు చెరువుల్లోని అక్రమ తవ్వకాలకు సాక్ష్యంగా పెద్దపెద్ద గుంతలు నిలుస్తున్నాయి. వీటిల్లో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారాయి.

అభివృద్ధి పనుల పేరుతో..

ఉదయగిరి నియోజకవర్గంలో జరుతున్న పలు అభివృద్ధి పనులు పేరుతో గ్రావెల్‌ దోపిడీ పెద్దఎత్తున సాగుతోంది. ముఖ్యంగా సీతారామపురం గ్రీన్‌ీఫీల్డ్‌ హైవే, వివిధ జాతీయ రహదారులు అభివృద్ధికి అవసరమైన గ్రావెల్‌ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రవాణా జరుగుతోంది. కావలి–సీతారామపురం జాతీయ రహదారి నిర్మాణానికి జలదంకి నుంచి సీతారామపురం వరకు రోడ్డు వెంట ఉన్న అనేక చెరువుల్లో గ్రావెల్‌ దోపిడీ సాగింది. దీంతో అనేక చెరువులు గోతులతో నిండాయి. ప్రస్తుతం చేపడుతున్న కలిగిరి–కొండాపురం రోడ్డు నిర్మాణ పనులకు కూడా రావులకొల్లు చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించడంలో అఽధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి.

ఉదయగిరిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

వింజమూరు, కలిగిరి మండలాల్లో

పెద్ద ఎత్తున తవ్వకాలు

కూటమి నేతలే సూత్రధారులు

మామూళ్ల మత్తులో

అధికార యంత్రాంగం

అక్రమార్కులకు అండగా అధికారులు

మట్టి అక్రమ రవాణా తంతు పట్టపగలే జాతీయ రహదారి మీదుగానే జరుగుతున్నా ఏ శాఖ అధికారి పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్లు తీసుకుంటూ వదిలి వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదవాడు ఇళ్లు కట్టుకునేందుకు ట్రాక్టర్‌ మట్టి చెరువుల నుంచి తోలుకుంటుంటే ఆగమేఘాలపై అక్కడ వాలిపోయి హడావుడి చేసి వాహనాలు సీజ్‌ చేసి జరిమానాలు విధించే అధికార యంత్రాంగం మట్టి మాిఫియా వైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికులు అక్రమాలపై ఫిర్యాదు చేసినా కూడా అధికార యంత్రాంగం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం ఈ వ్యవహారంలో పచ్చనేతల ప్రమేయం ఉండడమేనని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement