పోరాడుదాం.. విజయం సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

పోరాడుదాం.. విజయం సాధిద్దాం

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది

కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు మనదే

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు : ‘త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడి విజయం సాధిద్దాం. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడొద్దు అండగా నేనుంటాను’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులో ఓ కల్యాణ మండపంలో మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకాణి హాజరై పార్టీ మండల, గ్రామ కమిటీల బాధ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేస్తే విజయం మనదేనన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2.0లో భాగంగా గ్రామస్థాయి నుంచి పార్టీను బలోపేతం చేసేందుకు కమిటీల నియామకం చేపట్టడం జరిగిందన్నారు. కార్యకర్తలను భుజాలపై మోసేందుకు సిద్ధంగా ఉన్నారని భరోసా కల్పించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. కార్యకర్తలు ఇదే అంశాలను జనాల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. త్వరలో గ్రామాల వారీగా నాయకులతో మాట్లాడుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ మహిళా అభ్యర్థులను ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఆర్యవైశ్యుల అరెస్ట్‌లను వక్రీకరిస్తున్న సోమిరెడ్డి

పట్టణంలోని ఆర్యవైశ్యుల అరెస్ట్‌పై సోమిరెడ్డి వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని కాకాణి ధ్వజమెత్తారు. ఎవరి హయాంలో వారిని అరెస్ట్‌ చేశారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో వాస్తవాలు మాట్లాడాలన్నారు. 2014–19 మధ్యకాలంలో ఎవరి ప్రభుత్వం ఉందో అందరికీ తెలుసునని, అప్పటి ఎమ్మెల్సీగా సోమిరెడ్డి, కలెక్టర్‌గా జానకి ఉన్నారని గుర్తుచేశారు. అదే సమయంలో ఆర్యవైశ్యులను అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. తమ పార్టీ ఐదేళ్ల పాలనలో వారికి పూర్తి రక్షణ కల్పించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారని కార్యకర్తలు ధైర్యంగా ముందుకు నడవాల్సిందిగా సూచించారు. పార్టీ నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, తెనాలి నిర్మలమ్మ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎస్‌కే అంజాద్‌ ,కోనం చినబ్రహ్మయ్య, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌, వూకోటి లక్ష్మీ నారాయణ, భారతమ్మ, జీ వేణుగోపాల్‌రెడ్డి, జీ లక్ష్మీకల్యాణి, గుంటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement