● బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నియామకాలపై తొలి విచారణ చేపడతామని వైఎస్సార్‌సీిపీ రాష్ట్ర యువజన విభాగంఅధ్యక్షుడు, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు, మాజీ మంత్రి అనిల్ అనుచరుడు శ్రావణ్‌ను ములాఖాత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనిల్ ను ఎదుర్కోలేక శ్రావణ్‌పై అక్రమ కేసులు బనాయించడం దారుణమ ని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్ద ఆయన మీడి యాతో మాట్లాడారు. క్రీడల పేరుతో బ్యాకప్ సర్టిఫికెట్లు లేకుండానే ఉద్యోగాలు పొందిన వారి వివరాలను సేకరించి ఉన్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీస్తామన్నారు. పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేలా జీఓ జారీ చేసినప్పుడే ఈ వ్యవహారంలో అక్రమాలకు బీజం పడిందని ఆరోపించారు. దీనికి తోడు స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచడం కూడా అందులో భాగమేనని విమర్శించారు. ఈ నిర్ణయాలపై లోకేశ్‌కు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన వారిని మీడియా ముందుకు తీసుకురాకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన వారితో ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. శాప్ కార్యాలయం ముట్టడికి శాంతియుతంగా వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించడం సరికాదన్నారు. పోలీసులను అడ్డుపెట్టి ఉద్యమాలను ఆపలేరని, ప్రజల తరఫున ప్రశ్నించే హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు.


