● అక్రమంగా తరలిస్తున్నారని
అడ్డుకున్న ఓ వర్గం టీడీపీ నాయకుడు
● నిబంధనల మేరకే పంపిణీ
చేస్తున్నామన్న పీఏసీఎస్ చైర్మన్
● టీడీపీలో బయటపడ్డ వర్గవిభేదాలు
జలదంకి (కలిగిరి): జలదంకి పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ విషయంలో అధికార టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు సోమవారం బయటపడ్డాయి. జమ్మలపాళెంలో గోదాము నుంచి రామవరప్పాడుకు సుమారు 300 బస్తాల యూరియాను తరలిస్తున్న వాహనాన్ని స్థానిక టీడీపీ నాయకుడు వర్ధినేని మురళి అడ్డుకున్నాడు. పీఏసీఎస్ చైర్మన్ అప్పలనాయుడు రామవరప్పాడులోని తన వర్గానికి చెందిన రవి, అతనికి చెందిన రైతులకు నిబంధనలకు విరుద్ధంగా యూరియాను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందే సుమారు 200 బస్తాలను తరలించారని, మళ్లీ 300 బస్తాలు తరలిస్తే మిగిలిన రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. అనంతరం దీనిపై అప్పలనాయుడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆన్‌లైన్ నిబంధనల మేరకు యూరియాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాగా తాను వాహనాన్ని ఆపిన అనంతరమే పీఏసీఎస్ సిబ్బందితో కొంతమంది రైతుల పేర్లను అన్‌లైన్‌లో నమోదు చేయించారని మురళి ఆరోపించారు. ఒక దశలో ఇరు వర్గాలకు చెందిన నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరగాయి. ఈ నేపథ్యంలో జలదంకి పీఏసీఎస్ పరిధిలో జరిగిన యూరియా పంపిణీపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.
143 మద్యం దుకాణాల
లైసెన్సులు రెన్యువల్
● రేపటి వరకు గడువు పొడిగింపు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని 193 మద్యం దుకాణాల్లో సోమవారం సాయంత్రం నాటికి 143 మద్యం దుకాణాల లైసెన్సులు రెన్యువల్ అయ్యాయి. బుధవారం వరకు రెన్యువల్ గడువును పొడిగిస్తూ ఎకై ్సజ్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని 193 మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. లైసెన్సుల పునరుద్ధరణకు ఈ నెల 12న ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు రెన్యువల్‌కు గడువు విధించగా, 143 మంది మద్యం వ్యాపారులు తమ దుకాణాల లైసెన్సులను రెన్యువల్ చేసుకున్నారు. గడువును పొడిగించడంతో మిగిలిన దుకాణాల లైసెన్సులు రెన్యువల్ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి రెన్యువల్ కాని దుకాణాలకు నోటిఫికేషన్ జారీచేసి లాటరీ విధానంలో కేటాయించనున్నారు.
భూముల ఆన్‌లైన్ బాగోతంపై
బహిరంగ విచారణ
సీతారామపురం : మండలంలోని దేవమ్మ చెరువు గ్రామంలో రీసర్వే తర్వాత జరిగిన భూముల ఆన్‌లైన్ బాగోతంపై ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ డీఏఓ సుజన్‌కుమార్ సోమ వారం బహిరంగ విచారణ చేపట్టారు. ఈ నెల 10న సాక్షిలో ‘దేవమ్మ చెరువులో భూచోళ్లు’ శీర్షికన వెలువడిన కథనంపై ఆత్మకూరు ఆర్డీఓ బీ పావని స్పందించారు ప్రత్యేక బృందాన్ని దేవమ్మ చెరువుకు పంపి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారుల బృందం గ్రామంలో గ్రామసభ నిర్వహించి రీసర్వే తర్వాత డీఎల్‌ఆర్‌లో ఉన్న అన్ని పేర్లను వరుసగా గ్రామస్తులకు చదివి వినిపించారు. అందులోని పదహారు పేర్లపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఇతరుల పేర్లు ఎలా ఎక్కించారనే విషయంపై వాస్తవాలు వెలికితీసి తుది నివేదికను ఆర్డీఓకు అందజేయనున్నట్లు దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ షేక్ ఫజిహా, ఆర్‌ఐ సుభాని, సర్వేయర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


