ఎన్నో సమస్యలు.. పరిష్కారంపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నో సమస్యలు.. పరిష్కారంపై ఆశలు

Sep 22 2026 12:00 AM | Updated on Sep 22 2026 12:00 AM

కలెక్టర్‌ కార్యాలయంలో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పోలీస్‌ శాఖలో పోస్టులు భర్తీ చేయాలని

ఏఐవైఎఫ్‌ డిమాండ్‌

నెల్లూరురూరల్‌: ‘అయ్యా సమస్య చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి అవస్థలు పడుతూ వచ్చాం. మీరు ఆలకించి న్యాయం చేయండి’ అని అర్జీదారులు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. ఇందులో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రామన్న చెరువులో రొయ్యల గుంతలు

అల్లూరు మండలం సింగపేట ప్రాంతానికి చెందిన కొందరు రైతులు రామన్న చెరువులో అక్రమంగా రొయ్యలు, చేపల గుంతలు ఏర్పాటు చేస్తున్నారని పలువురు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి ఆధ్వర్యంలో జేసీకి వినతిపత్రం అందజేశారు. చెరువు పైభాగంలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో గుంతలు, రొయ్య పిల్లల హేచరీ నిర్మిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు 100 ఎకరాల్లో గుంతలు ఏర్పాటు చేసి రొయ్య పిల్లలను వదిలారన్నారు. రాజకీయ పలుకుబడితో చెరువు భూమిని ఆక్రమించి గుంతలు నిర్మిస్తున్నారని తెలిపారు. దీంతో సింగపేటతోపాటు పరిసర గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును పరిశీలించి ఆక్రమణలను తొలగించి, సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంగం బస్టాండ్‌లో వసతుల కొరత

సంగం బస్టాండ్‌ వద్ద బస్‌ షెల్టర్‌, మూత్ర విసర్జన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన అన్నెం వెంకట సుబ్బయ్య తెలిపారు. సంగం మీదుగా రోజుకు సుమారు 100 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని, బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంగంలో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి కలెక్టర్‌ ఇప్పటికే మంజూరు చేసినప్పటికీ స్థల సేకరణలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

11 వేల పోలీస్‌ పోస్టులు భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ మున్నా డిమాండ్‌ చేశారు. జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో సుమారు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 11,639 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల భర్తీకి అనుమతులిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 2,050 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇవ్వడం నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమేనన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై స్పష్టమైన సమాచారం ప్రకటించి, అన్నింటి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అహ్మద్‌, మీరాముద్దీన్‌, జాకీర్‌, అఖిల్‌, మస్తాన్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement