● రూ.12 లక్షలు తీసుకున్నారని ఆరోపణ
● బాధితుడికి న్యాయం చేయాలని
సీపీఐ నేతల డిమాండ్
గూడూరు: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువకుల కుటుంబం నుంచి రూ.12 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని సీపీఐ నాయకుడు శశికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గూడూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితుడు వెంకటరమణయ్య మాట్లాడారు. తిక్కవరం గ్రామానికి చెందిన జి.మస్తానయ్య నెల్లూరులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కుమారులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, ఖర్చుల పేరుతో విడతల వారీగా రూ.12 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఏడాది గడిచినా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతోపాటు తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. శశికుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బాధితుడు వెంకటరమణయ్య, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


