● సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రభుత్వం వెంటనే జిల్లాలో కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నేడు జిల్లాలోని అనేక మండలాల్లో కరువు అధికంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువుల్లో నీరు లేక రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పెంచడం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందుగా హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సమీక్షలు, ప్రచార ఆర్భాటాలకే నేటి ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. సీఎం కరువు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు మోహన్‌రావు, వన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.


