● గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి
నెల్లూరు(వేదాయపాళెం): ఆధార్ కార్డుల్లేని 20 వేల మంది గిరిజనులను గుర్తించామని, స్వీయ అఫిడవిట్ ఆధారంగా ఇప్పటికే 15,500 మందికి వాటిని మంజూరు చేసినట్లుగా గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవి తెలిపారు. గిరిజనులకు అమలవుతున్న వివిధ పథకాలపై సోమవారం నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆధార్ కార్డుల కోసం మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా యానాదులకు పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆధార్ కార్డులు, తద్వారా ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఐటీడీఏతోపాటు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పదో తరగతి అనంతరం గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ట్రైకార్ ఎండీ ఆనంద్ మణికుమార్, ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్ట్ అధికారి కె.శ్రీనివాసరావు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


