డ్రైవర్లే చెకింగ్‌లు.. ఇదేంది కొత్తగా ఉందేననే అనుమానం కలగక మానదు. అయితే జిల్లాలో జరుగుతున్న తంతును చూస్తే ఇది నిజమనే విషయం అర్థమవుతోంది. వాస్తవానికి రవాణా అధికారులు తనిఖీలకు వెళ్లే సమయాల్లో వారికి సాయంగా హోంగార్డులు, అటెండర్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. అయ | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్లే చెకింగ్‌లు.. ఇదేంది కొత్తగా ఉందేననే అనుమానం కలగక మానదు. అయితే జిల్లాలో జరుగుతున్న తంతును చూస్తే ఇది నిజమనే విషయం అర్థమవుతోంది. వాస్తవానికి రవాణా అధికారులు తనిఖీలకు వెళ్లే సమయాల్లో వారికి సాయంగా హోంగార్డులు, అటెండర్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. అయ

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

నెల్లూరు (టౌన్‌): రవాణా శాఖలో అంతా ఇష్టానుసారంగా సాగుతోంది. అక్కడి అధికారులు నియమించుకున్న డ్రైవర్లు, ప్రైవేట్‌ వ్యక్తులే కింగ్‌ మేకర్లుగా చెలామణీ అవుతున్నారు. రహదారులపై తనిఖీలు చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, నెలవారీ మామూళ్ల వరకు అన్నీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత వారికే పెద్దపీట

జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రవాణా అధికారులకు హోంగార్డు లేదా అటెండర్‌ను కేటాయించారు. అయితే వీరిని పక్కనబెట్టి సొంతంగా నియమించుకున్న వారినే తనిఖీలకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అడిగినంత మేర ఇవ్వకపోతే లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా విశాఖపట్నం సమీపంలోని జాతీయ రహదారిపై ఏఎమ్వీఐ పార్వతి మూడు రోజుల క్రితం తనిఖీలు చేస్తున్న సందర్భంగా, ఆమె కారు డ్రైవర్‌.. ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేశారు. ఘటనలో సదరు వ్యక్తి కన్ను దెబ్బతినిందని తెలిసింది. వీడియో వెలుగులోకి రావడంతో సదరు ఏఎమ్వీఐని ఎస్టీఏకు ఆ శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా అటాచ్‌ చేశారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా చెకింగ్‌ సమయంలో డ్రైవర్‌ లేదా ప్రైవేట్‌ వ్యక్తులుంటే చర్యలు చేపడతామనే ఆదేశాలనూ జారీ చేశారు.

మారతారా.. లేక అలానే వ్యవహరిస్తారా..?

జిల్లాలోనూ కొందరు అధికారులు వాహనాల తనిఖీల సమయంలో తమ వెంట నలుగురైదుగురు ప్రైవేట్‌ వ్యక్తులకు తమ వెంట తీసుకెళ్తున్నారని తెలిసింది. కమిషనర్‌ ఆదేశాల తరుణంలో వీరిని పక్కనబెడతారా లేక తమ ఇష్టానుసారం కొనసాగిస్తారాననే అంశం తెలియాల్సి ఉంది.

నిరంతరం తనిఖీలే..

టార్గెట్ల పేరుతో పగలూ, రాత్రనే తేడా లేకుండా రాష్ట్ర, జాతీయ రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకంగా నియమించుకున్న డ్రైవర్లు, ప్రైవేట్‌ వ్యక్తులను తమ వెంట తీసుకెళ్తున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు వాహనాలను పెట్టే సమయాల్లోనే హోంగార్డులు, అటెండర్లను వినియోగించుకుంటూ, మిగిలిన సమయాల్లో వీరిని ఇంటికే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక చెకింగ్‌ సమయాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు యూనిఫారం లేకుండా రోడ్లపై వాహనాలను ఆపుతున్నారు. అసలు వీరెవరనే అంశం డ్రైవర్లకు అర్థం కావడంలేదు. కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు తమకెందుకులేనని మిన్నకుండిపోతున్నారు.

వివరాల నమోదూ వీరితోనే..

వాస్తవానికి కేసుల వివరాలను ఆన్‌లైన్లో అధికారులే స్వయంగా నమోదు చేయాల్సి ఉంది. అయితే కొందరు మాత్రం ప్రైవేట్‌ వ్యక్తులతో ఈ పనిని చేయించుకుంటున్నారు. మరోవైపు గూడూరులో పనిచేస్తున్న ఓ రవాణా అధికారి రోజంతా రోడ్డుపైనే ఉండి ఫుల్‌ కలెక్షన్లతో ఇంటికెళ్తున్నారని ఆ శాఖలో పనిచేసే వారే పేర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో పశువుల సంత, ధాన్యం లారీలు, ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్‌ తదితర ఆదాయ వనరులున్నాయి. సదరు ఆఫీసర్‌ వెంట ఆయన నియమించుకున్న ప్రైవేట్‌ వ్యక్తులే ఉంటారని పేర్కొంటున్నారు. జిల్లా రవాణా అధికారుల్లో ఇప్పటికై నా మార్పొస్తుందా.. లేదాననే అంశం వేచి చూడాల్సిందే.

రవాణా అధికారుల వెంట తనిఖీలకు వీరు, ప్రైవేట్‌ వ్యక్తులు

హోంగార్డులు, అటెండర్లను

కేటాయించినా పక్కనబెడుతున్న వైనం

లారీలు, ఇతర వాహనాల నుంచి నేరుగా వసూళ్లు

అడిగినంత ఇవ్వకపోతే దాడులు

విశాఖపట్నం సమీపంలో

వెలుగులోకి వచ్చిన ఘటన

జిల్లాలోనూ ఇదే తంతు

అడిగినంత ఇస్తే సరే.. లేకపోతే కేసే

ఓవర్‌లోడ్‌ వాహనం కనబడితే అధికారి బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆఫీసర్‌ డ్రైవరో లేదా ప్రైవేట్‌ వ్యక్తికో యూపీఐ చేయించుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే కేసు నమోదు చేసేందుకూ వెనుకాడటంలేదు. కొన్ని సందర్భాల్లో దాడులకూ తెగబడుతున్నారు. తనిఖీలకు వచ్చిన అనధికారిక వ్యక్తులకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నిత్యం ముట్టజెప్తున్నారనే టాక్‌ నడుస్తోంది. మరోవైపు ఆఫీసర్లకు తెలియకుండా ఇతర వాహనాల డ్రైవర్లను బెదిరించి తమ జేబులను వీరు నింపుకొంటున్నారు.

జిల్లాలో ఇలా..

ఇలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

తనిఖీల సమయంలో వారు నియమించుకున్న ఒక డ్రైవరే ఉండాలి. కేటాయించిన హోంగార్డు లేదా అటెండర్‌నే తీసుకెళ్లాలి. అలా కాకుండా ఇష్టమొచ్చిన వారిని తీసుకెళ్తే చర్యలు తప్పవు. రవాణా కమిషనర్‌ ఆదేశాలతో జిల్లాలోని ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలతో సమావేశాన్ని నిర్వహించాం. వీరికి అన్ని అంశాలను స్పష్టంగా చెప్పాం. తనిఖీలు చేస్తున్న ప్రాంతానికెళ్లి పరిశీలిస్తా. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవు.

– చందర్‌, ఉప రవాణా కమిషనర్‌

జిల్లాలో 18 మంది ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలు పనిచేస్తున్నారు. నగరంలో నలుగురు.. కావలి, ఆత్మకూరులో ఒకరు చొప్పున.. గూడూరు, స్క్వాడ్‌లో ఇద్దరు చొప్పున ఎమ్వీఐలు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా నెల్లూరు హెడ్‌ క్వార్టర్స్‌లో ఐదుగురు.. కావలి, గూడూరు, స్క్వాడ్‌లో ఒకరు చొప్పున.. ఇలా ఎనిమిది మంది ఏఎమ్వీలున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా ఏడాదికి రూ.17.04 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. స్క్వాడ్‌లో ఉండే ఎమ్వీఐ, ఏమ్వీఐ నెలకు రూ.పది లక్షలు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉండే ఎమ్వీఐ రూ.ఎనిమిది లక్షలు.. ఏఎమ్వీఐ రూ.12 లక్షలు.. హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండే ఎమ్వీఐ నెలకు రూ.6.5 లక్షలు.. ఏఎమ్వీఐ రూ.9.5 లక్షల మేర టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement