నెల్లూరు(పొగతోట): పేదల బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంతో తిప్పలు తప్పడంలేదు. ఫలితంగా నిర్దేశించిన సమయానికి రేషన్ పంపిణీ కష్టతరంగా మారుతోంది. వాస్తవానికి దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే వీటిని బుధవారం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా 25 శాతం దుకాణాలకు శాతం వీటిని పంపిణీ చేయలేదు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో బస్తాలను అన్‌లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గతంలో సజావుగా..
గతంలో 250 బస్తాలను అన్‌లోడ్ చేసేందుకు గంటే పట్టేది. అయితే ప్రస్తుతం ఏడు గంటలకుపైగా పడుతోంది. హమాలీలు గతంలో రోజూ రూ.వెయ్యికిపైగా సంపాదించేవారు. అయితే నూతన విధానంతో రూ.300 రావడమే గగనంగా మారుతోంది. జిల్లాలో 1513 చౌక దుకాణాలున్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల నుంచి ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్నిమినీ ట్రక్కుల ద్వారా వీటికి సరఫరా చేస్తున్నారు.
కొత్తగా యాప్
బియ్యం బస్తాలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. దీన్ని స్కానింగ్ చేసేందుకు గానూ ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. చౌక దుకాణాల డీలర్లు స్కాన్ చేశాకే, బియ్యం బస్తాలను హమాలీలు అక్కడ అన్‌లోడ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతి నెలా 25వ తేదీ నాటికి 70 నుంచి 80 శాతం మేర.. మిగిలిన మొత్తాన్ని 25 నుంచి మరుసటి నెల ఒకటిలోపు పూర్తి చేసేవారు. అయితే ప్రస్తుతం 25 శాతం సరఫరా సైతం పూర్తి కాలేదు. నెల్లూరులోని ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌కు సంబంధించి 292 చౌక దుకాణాలకు రేషన్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 54 షాపులకు మాత్రమే చేర్చారు.
స్కానింగ్.. తలనొప్పిగా..!
లారీని డీలర్లెక్కి ప్రతి బియ్యం బస్తాను స్కాన్ చేయాలి. ఇది సక్సెస్ అయితేనే హమాలీ అన్‌లోడ్ చేయాలి. అయితే పదింటిలో నాలుగైదు మాత్రమే సక్సెస్ అవుతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విధానం తమకు తలనొప్పిలా మారిందని పేర్కొంటున్నారు. జాప్యంతో సరఫరా చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పాత బస్తాలే సరఫరా
ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలో పాత బియ్యం బస్తాలు నిల్వ ఉన్నాయి. ముందుగా చౌక దుకాణాల డీలర్ల నేతల షాపులకు క్యూఆర్ కోడ్ లేని వాటిని సరఫరా చేశారు. నగరంలో సుమారు 25 షాపులకు ఇలా జరిగింది. తొలుత ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలోనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని ఆదేశించారు. అయితే వేల బస్తాల అన్‌లోడ్‌లో తీవ్ర జాప్యం జరగడంతో ప్రక్రియను విరమించి చౌక దుకాణాల్లోనే జరపాలనే ఉత్తర్వులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు జారీ చేశారు.
స్కానింగ్.. పరేషాన్
చౌక దుకాణాలకు చేరని రేషన్
జాప్యమవుతున్న వైనం
లారీ లోడ్ దించేందుకే ఏడు గంటలు
కూలిలు గిట్టుబాటు
కావడంలేదంటున్న హమాలీలు


