● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: కూటమి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి చోటుచేసుకుంటోందని.. అభివృద్ధిని గాలికొదిలి దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు, ముత్తుకూరు మండలంలోని నేలటూరుపాళెంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. తనపై సోమిరెడ్డి చేసిన ఆరోపణలకు కట్టుబడి, తన సవాల్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు. అవినీతిపరుడు కాదని ఆయన ప్రమాణం చేయడంతో పాటు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని పేర్కొన్నారు. రావుల ఇంద్రసేన్‌గౌడ్‌కు చెందిన భూములు తన బినామీవిగా ఆంజనేయస్వామి సమక్షంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమని ప్రమాణం చేయాలని తాను కోరినా ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. పొదలకూరులో అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించాలని తాను పలుమార్లు డిమాండ్ చేసినా, ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. లేవుట్ల యజమానుల వద్ద లబ్ధి పొందకపోతే విచారణ జరిపించాలన్నారు.
బల్కర్లకు ఎందుకు అనుమతిచ్చారు..?
ముత్తుకూరు మీదుగా బూడిద బల్కర్లు మళ్లీ వెళ్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వీటికి అనుమతులను ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కప్పం కట్టాలనే డిమాండ్‌కు బల్కర్ల యజమానులు అంగీకరించకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళలు చేపట్టారని, బేరసారాలు కుదిరాక వీటిని యథాతథంగా వదిలారని మండిపడ్డారు. దీనిపై పోలీసుల సహకారం తీసుకున్నారని ఆరోపించారు. గిరిజనులపై వల్లమాలిన అభిమానం కురిపించే సోమిరెడ్డి, పంటపాళెంలోని వారి భూముల్లో ఇష్టానుసారం గోతులు తీస్తూ మట్టిని విక్రయిస్తుంటే చర్యలను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్‌విగా చూపించి పామాయిల్ ఫ్యాక్టరీలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారని, తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే వీటిపై సమగ్ర విచారణను చేపడతామని స్పష్టం చేశారు. అధికారుల చుట్టూ నేలటూరు గ్రామస్తులు ప్రదక్షిణలు చేస్తున్నా, బూటకపు మాటలు చెప్తున్నారని, వీరికి పునరావాసాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వధూవరులు సునీల్, సాయివెంగమ్మ.. పవన్ కల్యాణ్, హేమలత, చంద్రారెడ్డి, అమృత.. దుర్గాప్రసాద్, జాలమ్మను ఆశీర్వదించారు. నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పామూరు లచ్చారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శ్రీహరి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


