జీపీఎస్‌కు మంగళం | - | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌కు మంగళం

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

నెల్లూరు (టౌన్‌): నగరంలో ట్రాఫిక్‌ నరకప్రాయంగా మారింది. రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళ్లే వేలాది ఆటోలు, పదుల సంఖ్యలో టౌన్‌ బస్సులు, వీటితో పాటు కార్లు, బైకులతో నిత్యం రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంటోంది. ఓ పక్క ఇరుకురోడ్లు, మరో పక్క ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో నిత్యం ఏదోక చోట ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. నగరంలో ఆటోలు, టౌన్‌ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారు. బస్టాప్‌తో సంబంధం లేకుండా ఆపమని చేయి ఎత్తకున్నా మనిషి కనబడితే చాలు ఆటో లేదా టౌన్‌ బస్సు ఆగిపోతుంది. దీంతో వెనుకగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా టౌన్‌ బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పర్మిట్‌తో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన రూట్‌లో తిరుగుతున్నా రవాణా, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారు. వారిచ్చే మామూళ్లు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇష్టారాజ్యంగా నిర్వహణ

నగరంలో టౌన్‌బస్సుల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. ప్రస్తుతం టౌన్‌ పరిధిలో 69 టౌన్‌ బస్సులు తిరుగుతున్నాయి. మరో 65 టౌన్‌ బస్సులకు పర్మిట్‌ కోసం రవాఽణా అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. టౌన్‌ బస్సులను తిప్పేందుకు రవాణా అధికారులు రూట్‌ మ్యాప్‌, సమయాన్ని కేటాయిస్తారు. పర్మిట్‌ తీసుకున్న రూట్‌లో నిర్దేశించిన సమయంలో బస్సులను తిప్పాల్సి ఉంది. పర్మిట్‌ కాల పరిమితి ఐదేళ్లు ఉంటుంది. బస్సులను కండీషన్‌లో ఉంచడంతో పాటు పరిమితి మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలి. అనుభవం కలిగిన డ్రైవర్‌తోనే బస్సులు నడపాలి. అయితే ఈ నిబంధనలు వారికి వర్తించవు. టౌన్‌ బస్సుల్లో ఎక్కుతున్న మహిళలపై డ్రైవర్లు, కండక్టర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. బస్సుల్లో సీసీ కెమెరాలు బిగించమని చెప్పినా పట్టించుకోవడం లేదు.

మరో 65 బస్సుల పర్మిట్లకు దరఖాస్తులు

నగరంలో ఇప్పటికే 69 టౌన్‌ సర్వీసులు తిరుగుతున్నాయి. మరో 65 బస్సులను తిప్పేందుకు పర్మిట్‌ల కోసం జిల్లా రవాణా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. బస్సులపై ఆదాయం ఉండడం, మామూళ్లు ఇస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో టౌన్‌ బస్సులను తిప్పేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న టౌన్‌ బస్సుల కండీషన్‌ సరిగా లేదు. కొత్తగా పర్మిట్లు తీసుకునే బస్సులు కూడా ఎక్కువగా సెకండ్‌ హ్యాండ్‌ బస్సులే ఉంటున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 20 వేల వరకు ఆటోలు తిరుగుతున్నట్లు రవాణా అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ రోడ్ల మీదకొస్తే నగరంలో ప్రయాణం నరకంగా మారుతుంది.

నిబంధనలు పాటించని టౌన్‌ బస్సుల నిర్వాహకులు

పేరుకే రవాణా స్క్వాడ్‌

ఎన్ని బస్సులు తిప్పితే అంత ఆదాయం అనుకుంటున్న రవాణా అధికారులు కొత్తగా పర్మిట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రవాణా శాఖలో ప్రత్యేకంగా స్క్వాడ్‌ ఉంటుంది. ఈ స్క్వాడ్‌లో ముగ్గురు అధికారులు ఉంటారు. వీరి పని కేవలం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం లేదా సీజ్‌ చేయడం. వీరు ఏనాడు నగరంలో తనిఖీలు చేపట్టడం లేదు. టౌన్‌ బస్సులను తనిఖీ చేస్తే శ్రమ తప్ప ఆదాయం రాదని వాటిపై దృష్టి సారించడం లేదు. హైవేలో అయితే ఓవర్‌లోడ్‌ వాహనాల నుంచి నగదు వెనుకవేసుకోవచ్చని ఎప్పుడు చూసినా అక్కడే తనిఖీలు చేస్తున్నారు. శుభకార్యాల సమయంలో టౌన్‌ బస్సులు పట్టుబడ్డా రూ.2వేలు తీసుకుని వదిలివేస్తున్నారు. టౌన్‌ బస్సులు, ఆటోల డ్రైవర్లకు ఏనాడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేసిన సందర్భాలు కూడా లేవు. బస్సులను కండీషన్‌ లేకుండానే తిప్పుతున్నా , అద్దాలు పగిలిపోయి ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లా ఉపరవాణా కమిషనర్‌ ఉన్నా మెతక వైఖరిని అవలంభిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికై నా నగరంలో తనిఖీలు నిర్వహించిన నిబంధనలు పాటించని టౌన్‌ బస్సులు, ఆటోలపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

పర్మిట్లు ఉన్న

రూట్లలోనే తిరగాలి

నగరంలో టౌన్‌ బస్సులు వారికి ఇచ్చిన పర్మిట్లలోనే తప్పనిసరిగా తిరగాలి. సమయం పాటించాలి. ప్రతి బస్సుకు జీపీఎస్‌ను బిగించాలి. పర్మిట్‌ తీసుకుని శుభకార్యాలయాలకు కాంట్రాక్ట్‌ క్యారేజీగా తిప్పితే బస్సులపై కేసు నమోదు చేసి సీజ్‌ చేస్తాం. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లల్లోనే బస్సులను ఆపాలి. బస్సులను కండీషన్‌లో ఉంచాలి. డ్రైవర్లు, కండక్టర్లకు తప్పనిసరిగా లైసెన్స్‌లు ఉండాలి.

–బీ చందర్‌, డీటీసీ

ఒక రూట్‌కు పర్మిట్‌..

తిరిగేది మరో రూట్‌లో..

మూణ్ణాళ్ల ముచ్చటగా జీపీఎస్‌

కండీషన్‌ కూడా అంతంత మాత్రమే

బస్సులను శుభకార్యాలకు

సైతం పంపిస్తున్న వైనం

ప్రస్తుతం తిరుగుతున్నది

69 టౌన్‌ బస్సులు

మరో 65 బస్సులకు

పర్మిట్ల కోసం దరఖాస్తులు

వీటికి తోడు 20వేలకుపైగా ఆటోలు

నగరంలో నరకంగా మారిన ట్రాఫిక్‌

పట్టించుకోని పోలీస్‌,రవాణా అధికారులు

టౌన్‌ బస్సుల నిర్వాహకుల ఆగడాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతంలో రవాణా అధికారులు పట్టుబట్టి మరి జీపీఎస్‌ను బిగించారు. జిల్లా రవాణా కార్యాలయంలో మానిటర్‌ను ఏర్పాటు చేసి టౌన్‌ బస్సులను పర్యవేక్షించే వారు. ఈ సిస్టంతో నెలపాటు బస్సులను తిప్పారు. ఆ తరువాత జీపీఎస్‌ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. జీపీఎస్‌ తొలగించినా రవాణా అధికారులు మిన్నకుండిపోవడంంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. పర్మిట్‌ రూటులో కాకుండా వారికి ఇష్టమైన రూట్‌లో తిప్పుతున్నారు. శుభకార్యాలకు సైతం టౌన్‌ బస్సులను అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రవాణా అధికారులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement