నెల్లూరు(అర్బన్) : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు ఉధృతం చేశారు. దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద జూడాలు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరింది. సోమవారం ఆస్పత్రి ఐపీ బిల్డింగ్ నుంచి మెడికల్ కళాశాల, ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం మీదుగా తిరిగి ఆస్పత్రి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనీష్‌కుమార్ మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్‌ను సవరించాలని, డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచరాదని, ఎంబీబీఎస్, పీజీ చేసిన వారితోనే తమకు వైద్య బోధన జరిపించాలని కోరామన్నారు. వీటిని అమలు చేసినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదన్నారు. వీటి గురించి పలు దఫాలు అధికారులు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెలోకి వెళ్లామన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అందరి మద్దతు తీసుకుని ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. కాగా జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యాజువాలిటీ, ఐసీయూలో వైద్య సేవలు ఆలస్యంగా అందుతున్నాయి. రోగులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సుజిత్, మధు, స్వామి, షాలిని, కావ్య, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో భారీ ప్రదర్శన
న్యాయమైన డిమాండ్లను
పరిష్కరించాలని నినాదాలు
15వ రోజుకు చేరిన సమ్మె
పట్టించుకోని ప్రభుత్వం
ఇబ్బందులు పడుతున్న రోగులు


