మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం 627 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాఽధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 736 బేళ్లు రాగా, 627 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.110, సగటున రూ.180.46 ధర పలికిందని తెలిపారు.
27న జిల్లాకు
ఎస్సీ కమిషన్ చైర్మన్ రాక
నెల్లూరురూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్‌తో పాటు సభ్యులు ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
నేత్రపర్వంగా
కోదండరాముని కల్యాణం
● హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి
ఎం వెంకయ్యనాయుడు
వెంకటాచలం: చవటపాళెంలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహోత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమ వారం కోదండరాముడి కల్యాణం, పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా హాజరై కల్యాణాన్ని తిలకించారు.
ప్రభుత్వ లేఅవుట్‌లోని
అక్రమ కట్టడాల గుర్తింపు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని భట్టువారిపాళెం రోడ్డులో సర్వే నంబరు 284లో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించడంపై ఈ నెల 19న ‘సాక్షి’లో ’కన్నేశారు..దున్నేశారు’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్ధార్ స్వర్ణ అదేశాల మేరకు సర్వేయర్ రవి, వీఆర్వో షాజిద్ తమ సిబ్బందితో కలిసి సోమవారం సర్వే చేపట్టి ఆక్రమణలను గుర్తించారు. పబ్లిక్ ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలంలోని ఆక్రమకట్టడాలకు మార్కింగ్ చేశారు. అందులో ఇళ్లు కూడా ఉండడంతో యజమానుల్లో ఆందోళన మొదలైంది. రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయం నెలకొంది. తహసీల్దార్ సమగ్ర విచారణ జరిపి ఒరిజినల్ లబ్ధిదారులకు న్యాయం చేసి అక్రమార్కులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.
శ్రీవారి దర్శనానికి
10 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,553 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,483 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


