● కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(పొగతోట): మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణను జరిపించేంత వరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై నిరసన ర్యాలీని నగరంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. మెగా డీఎస్సీ ఉద్యమంలో సీఎం పీఠం కదిలిపోతోందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. తమ పార్టీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని వివరించారు. డీఎస్సీ పేపర్ లీకై ందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలు, కుతంత్రాలతో అభ్యర్థులకు సర్కార్ అన్యాయం చేసిందని మండిపడ్డారు. సీబీఐ విచారణను తాము కోరుతుంటే, మంత్రి నారాయణ క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు.
సమైక్యాంధ్ర తర్వాత అతి పెద్ద ఉద్యమమిదే..
సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరుగుతోంది మెగా డీఎస్సీ ఉద్యమమేనని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులను శిక్షించాలనే తాము కోరుతున్నామన్నారు. డీఎస్సీని రద్దు చేయాలనో లేదా ఇచ్చిన ఉద్యోగాలను తీసేయాలని తామెక్కడా చెప్పడంలేదని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, ఆయన మంత్రిగా ఉంటే విచారణను పక్కదారి పట్టించే అవకాశం ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఉద్యమం చేస్తున్న తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ.. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. యువత, విద్యార్థులు రోడ్లపైకొచ్చి ప్రశ్నిస్తుంటే, విచారణకు సర్కార్ ఎందుకు వెనుకడుగేస్తోందో చెప్పాలన్నారు. ఉద్యోగాలొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసి వారితో ర్యాలీలు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే ప్రోత్సహించి.. బస్సులను ఏర్పాటు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.


