రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. ఇంటి పెద్దలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఓ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో
ముగ్గురి దుర్మరణం
గ్రావెల్ టిప్పర్ ఢీకొని..
కోట: ఉపాధి పనులు ముగించుకుని మోపెడ్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను గ్రావెల్ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో భర్త దుంపల ఏడుకొండలు (58) మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం విద్యానగర్ సమీపంలోని సాగరమాల రోడ్డులో చోటుచేసుకుంది. ఎస్సై పవన్‌కుమార్, కొత్తపాళెం గ్రామస్తుల కథనం మేరకు.. కొత్తపాళేనికి చెందిన ఏడుకొండలు తన భార్య లక్ష్మమ్మతో కలిసి పెన్నక్కచెరువు వద్ద ఉపాధి పనులకు వెళ్లాడు. ముగిశాక మోపెడ్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా సాగరమాల రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రోడ్డు నిర్మాణానికి గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్.. రోడ్డు దాటుతున్న మోపెడ్‌ను ఢీకొంది. దీంతో ఏడుకొండలు టిప్పర్ చక్రాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. లక్ష్మమ్మకు గాయాలు కావడంతో కోటకు తరలించి చికిత్స అందించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు.
ఆటో బోల్తా పడి..
చేజర్ల: ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందగా.. అతని కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటన చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సమీపంలోని రెడ్డిగుంట వాగు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు.. పుట్టుపల్లి గ్రామానికి చెందిన ఫేక్ రహంతుల్లా (46) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన కుమార్తె పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఆటోలో నెల్లూరుకు వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తుండగా చిత్తలూరు సమీపంలోని రెడ్డిగుంట వాగు వద్దకు వచ్చేసరికి కోతి అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటో కుదుపులకు కుమారుడు కిందకు దూకుతున్న సమయంలో రహంతుల్లా అతడిని పట్టుకుబోయాడు. ఈ క్రమంలో ఆటోను వదిలేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఆటో కింద నలిగిపోయారు. రహంతుల్లా అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుడు పలువురు యువకులకు ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చేవాడు. అందరితో సన్నిహితంగా మెలిగే రహంతుల్లా మృతితో తోటి ఆటో డ్రైవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో 30 నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటామని ఫోన్‌లో చెప్పిన వ్యక్తి.. ఇంతలోనే ప్రమాదానికి గురై మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


