సమ్మెలోకి జూడాలు | - | Sakshi
Sakshi News home page

సమ్మెలోకి జూడాలు

Aug 11 2026 12:30 AM | Updated on Aug 11 2026 12:30 AM

తొలిరోజే రోగులకు ఇబ్బంది

నెల్లూరు(అర్బన్‌): తాము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి తమ స్టైఫండ్‌ను పెంచాలని ఎంతో కాలంగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టామని ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (జూడా) జిల్లా అధ్యక్షుడు హనీష్‌ అన్నారు. రాష్ట్ర అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఐపీ భవనం వద్ద జూనియర్‌ డాక్టర్లు నల్లరిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమను మరోదఫా చర్చలకు ఆహ్వానించినందున పూర్తి స్థాయిలో పీజీలు, ఎస్‌ఆర్‌లు, జూడాలు సమ్మెలో పాల్గొనలేదన్నారు. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే మంగళవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలిరోజే రోగులకు ఇబ్బంది ఏర్పడింది. వైద్యసేవలు సక్రమంగా అందలేదు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు భార్గవ్‌, నిర్మల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల విషయంలో అలసత్వం వద్దు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ప్రజలు అందించే ఫిర్యాదుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని ఎస్పీ డాక్టర్‌ అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎస్పీ పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 156 మంది వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫిర్యాదును సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ వేమారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, పాపారావు, సీతారామయ్య, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రైస్తవుల శాంతియుత

నిరసన ర్యాలీ

నెల్లూరు(అర్బన్‌): క్రైస్తవులకు ఇబ్బందిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 3ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరులోని ట్రంక్‌రోడ్డు, వీఆర్సీ మీదుగా కలెక్టరేట్‌ వరకు శాంతియుత ర్యాలీ జరిగింది. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ క్రైస్తవ మతం అనుసరిస్తే వారికి షెడ్యూల్‌ కులాల హోదా నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చర్చిలపై, క్రైస్తవుల ఆస్తులపై మతోన్మాదంతో చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపైన వేసిన జస్టిస్‌ రంగనాథమిశ్రా కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలన్నారు. 2022లో బాలకృష్ణ కమిషన్‌ను కాలయాపన చేసేందుకు కేంద్రం వేసిందన్నారు. దళిత క్రైస్తవులకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎలీషాకుమార్‌, ఫాదర్‌లు జోసఫ్‌కుమార్‌, ఇన్నయ్య, హృదయరాజ్‌, రమేష్‌, ఊరందురు సురేంద్రబాబు, బర్నాబాస్‌, పాస్టర్‌ హనోక్‌, రాజు, రాజశేఖర్‌, విజయకుమార్‌, రమేష్‌, కిషోర్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో

ఇద్దరి అరెస్ట్‌

కావలిరూరల్‌: దగదర్తి వద్ద వెలుగులోకి వచ్చిన గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీవీ రమణకుమార్‌ వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనం దగదర్తి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement