నెల్లూరు (టౌన్): స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపక పోస్టుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను కళాశాలలో ఈ నెల 17లోపు అందజేయాలని, ఇంటర్వ్యూలను 19న నిర్వహించనున్నామని చెప్పారు. పీజీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో
డిగ్రీ ప్రవేశాలు
నెల్లూరు (టౌన్): అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సర్వోదయ కళాశాల కోఆర్డినేటర్ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎసీఎస్ కోర్సులున్నాయని చెప్పారు. వివరాలకు drbraouap.ac.inను సంప్రదించాలని సూచించారు.
పవిత్ర ఆలయంలో
చిల్లర వేషాలు
● సింహపురి గ్రామదేవత
సన్నిధిలో వీరంగం
● నియోజకవర్గ ప్రజాప్రతినిధి పేరుతో
హల్‌చల్
నెల్లూరు(బృందావనం): స్థానిక ప్రజాప్రతినిధి మనుషులమంటూ ఓ పది, 15 మంది నెల్లూరు రూరల్ పరిధిలోని సింహపురి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో హల్‌చల్ చేశారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఎంతో మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో రూ.50 టికెట్లను కొందరు తీసుకోకుండా వీఐపీ దర్శనం కల్పించాలంటూ నానా హంగామా చేశారు. వీరిని క్యూలైన్లను పర్యవేక్షిస్తున్న సిబ్బంది నిలువరించారు. ఈ క్రమంలో విధివిధానాలను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులతో కలిసి దేవస్థాన ప్రాంగణంలో గందరగోళం చేసేందుకు యత్నించారు. సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తూ వారిపైకొస్తూ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ తతంగం జరుగుతున్నా, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్రయాదవ్, ఈఓ గిరికృష్ణ మిన్నకుండిపోయారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి పేరు చెప్పడంతో ఎవరితో ఎలాంటి ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వారు మౌనం దాల్చారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నెల క్రితమే దేవస్థానంలో గదిని బుక్ చేసుకున్న వారితో సైతం వాగ్వాదానికి దిగారని సమాచారం. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వరిస్తున్న స్వప్న అనే ఉద్యోగితో పాటు మరో నలుగురిపై అనుచితంగా ప్రవర్తించారు. పలు అంశాలను తమ ఫోన్లలో చిత్రీకరించి సిబ్బందిపై చిందులేశారు.
మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై
కేసు నమోదు
ఉదయగిరి: అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై కేసును ఎస్సై మహేంద్ర సోమవారం నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం సృష్టించారంటూ కేసు నమోదు కావడం విస్మయానికి గురిచేసింది. కాగా మరికొందరిపై సైతం కేసు నమోదు చేశారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 87,179 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 34,256 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.4.03 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


