ఒకరికి రక్ష.. మరొకరికి శిక్ష | - | Sakshi
Sakshi News home page

ఒకరికి రక్ష.. మరొకరికి శిక్ష

Aug 6 2026 1:15 AM | Updated on Aug 6 2026 1:15 AM

సమగ్ర శిక్షలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలకు పాల్పడేది ఒకరైతే శిక్ష మాత్రం మరొకరికి పడుతోంది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులను వదిలేసి.. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి పనిష్మెంట్లు విధిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. అసలు దోషులను వదిలి ఎంబుక్‌లను నమోదు చేసి పాపానికి చిరుద్యోగులపై యాక్షన్‌ తీసుకుంటుండటం కలకలాన్ని సృష్టిస్తోంది.

నెల్లూరు(పొగతోట): సమగ్ర శిక్షలో పాఠశాలల ప్రహరీల నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలు భారీగా జరిగాయి. దీనికి పాల్పడిన ప్రభుత్వోద్యోగులను కాపాడేందుకు యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయమై పీఆర్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బలి చేసేలా ఉన్నాయనే అనుమానాలు వారిలోనే వ్యక్తమవుతున్నాయి.

అంతా వారే..

వాస్తవానికి ప్రహరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.. అనుమతులిచ్చింది.. పనులను పరిశీలించింది.. వర్క్‌ ఐడీలను సృష్టించింది.. ఎంబుక్‌లను రూపొందించింది.. వీటిపై సంతకాలు, స్టాంపులేసింది ప్రభుత్వోద్యోగులే. చివర్లో ఎంబుక్స్‌ను తీసుకొస్తే అప్‌లోడ్‌ చేసింది మండల కార్యాలయాల్లోని డ్వామా సిబ్బంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాకుండా మండల ఆఫీసుల్లో మాత్రమే రికార్డులను ఎస్సార్పీలు పరిశీలించనున్నారు. రికార్డులను సమగ్ర శిక్షకు సంబంధించిన ప్రభుత్వోద్యోగుల వద్ద ఉంచుకొని, ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేశాక మండల కార్యాలయాల్లో ఎలా ఉంటాయో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

బలిపశువులను చేసేలా..

పనులను ఎస్సార్పీలు ఏ మాత్రం పరిశీలించడంలేదు. సమగ్ర శిక్షకు సంబంధించిన అధికారులను విచారించాల్సిన యోచనే చేయడంలేదు. అప్‌లోడ్‌ చేసిన డ్వామా సిబ్బందిని మాత్రం బలిపశువులను చేసేలా ఉత్తర్వులున్నాయి. మండల కార్యాలయాల్లో కంప్యూటర్లను పరిశీలిస్తే అప్‌లోడ్‌ చేసిన వివరాలే ఉంటాయి. వీటి ఆధారంగా డ్వామా ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలను ఎలా చేపడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అభయహస్తం..

అవినీతికి పాల్పడిన ప్రభుత్వోద్యోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయని మండలాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేది ఆఫీసర్లే. జిరాక్స్‌లను తీసుకొని చివరి క్షణంలో వచ్చి సైట్‌ క్లోజ్‌ అవుతుందని, అప్‌లోడ్‌ చేయాలంటూ ఒత్తిడి తెస్తారు. అన్ని చేసిన వారిని వదిలిపెట్టి, చివరగా అప్‌లోడ్‌ చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఒక్కో చోట ఒక్కోలా..

వీబీ – జీరామ్‌జీకి సంబంధించి మండలాల్లో చేసిన పనులపై సోషల్‌ ఆడిట్‌ను ఏటా నిర్వహిస్తారు. అయితే సమగ్ర శిక్షలో మాత్రం ఎలాంటి రికవరీల్లేకుండా మండల ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బందిని ఎందుకు బాధ్యులను చేస్తున్నారో అంతుచిక్కడంలేదు, నేతల ఒత్తిళ్లతో జిరాక్స్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసిన వారిపై చర్యలు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

అవినీతికి భారీగా స్కెచ్‌

సమగ్ర శిక్షలో పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలకు సంబంధించి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర అవినీతికి ప్రణాళికలను రూపొందించారు. 310 నుంచి 320 పాఠశాలల్లో నిర్మించిన వాల్స్‌కు బిల్లులు చేశారు. నాడు – నేడు ద్వారా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రహరీలకు ప్రస్తుతం రెండోసారి బిల్లులేసేలా మోసానికి తెరలేపారు. కాంట్రాక్టర్లకు రూ.నాలుగైదు కోట్ల మేర చెల్లించారు. అయితే అవినీతి అంశం బయటకు పొక్కడంతో వింజమూరు, మనుబోలుకు మండలాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు నగదును తిరిగిచ్చేశారు. అక్రమాలపై విచారణ ప్రస్తుతం లోతుగా జరుగుతోంది.

రూ.కోట్ల అవినీతికి పాల్పడిన

ఉద్యోగులపై చర్యలు శూన్యం

పనిష్మెంట్లు మాత్రం అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి

సోషల్‌ ఆడిట్‌లో రికవరీలేవీ..?

ఎంబుక్‌లు అప్‌లోడ్‌ చేసిన పాపానికి యాక్షన్‌

కార్యాలయాల్లో రికార్డుల

పరిశీలనకు చర్యలు

సమగ్ర శిక్షలో వింత ధోరణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement