హామీలు నెరవేర్చాలి
జిల్లాలో దాదాపు 10 వేల మంది చేనేత కార్మికులు, ఉపవృత్తిదారులు ఉన్నారు. వారందరికీ నేతన్న నేస్తం, ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డిమాండ్లు నెరవేరకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని చేనేత సంఘాలను ఐక్యం చేసి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతాం.
– బుధవరపు బాలాజీ, జిల్లా అధ్యక్షుడు, ఐక్య చేనేత కార్యాచరణ సమితి
నాడు భరోసా
గత ప్రభుత్వం మమ్మల్ని నేతన్న నేస్తం పథకం ద్వారా ఆదుకుంది. ఆర్థికంగా భరోసా కల్పించింది. ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. అర్హుల జాబితాలో నుంచి తొలగించడం అన్యాయం.
– అందే ధనమ్మ,
చేనేత కార్మికురాలు, సంగం
నెల్లూరురూరల్: అత్యంత పురాతనమైన, గౌరవప్రదమైన సంప్రదాయ వృత్తుల్లో చేనేత ఒకటి. యంత్రాల సహాయం లేకుండా చేతులు, కాళ్ల సమన్వయంతో మగ్గాన్ని నడిపి వస్త్రాలను నేయడం ఈ వృత్తి ప్రత్యేకత. ఇది కేవలం జీవనోపాధి మాత్రమే కాదు.. తరతరాలుగా సంక్రమించిన భారతీయ సంస్కృతి, కళా వైభవానికి ప్రతీక. నేత కార్మికుల శ్రమను గుర్తించి, స్వదేశీ వస్త్రాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో నేతన్నలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదు.
వేలాది కుటుంబాలకు అండ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ఎంతోమందిని ఆదుకుంది. సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఆధునిక పరికరాల కొనుగోలు, ఉపాధి మెరుగుదల కోసం ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందించారు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. కరోనా సమయంలో ఒక ఏడాదికి సంబంధించిన రెండు విడతల్లో నగదు మొత్తాన్ని ఒకేసారి విడుదల చేశారు.
లబ్ధిదారుల సంఖ్యలో కోత
చేనేత రంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని, నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా చేనేత కుటుంబాల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 7న నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో సుమారు 3,800 మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం 2,600 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. కొర్రీలు పెట్టి దాదాపు 1,200 మందిని పథకం నుంచి తొలగించారని చేనేత సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాట ఇచ్చారంతే..
ఉచిత విద్యుత్ పథకం అన్ని చేనేత కుటుంబాలకు వర్తించడం లేదు. అద్దె ఇళ్లలో నివసించే నేతన్నలు, షెడ్డు వర్కర్లకు ఈ పథకం వర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా మూడు సంవత్సరాలకు రూ.75 వేల ఆర్థిక సాయం అందించాలని, అయితే తొలి రెండేళ్ల బకాయిలు చెల్లించకుండా కేవలం రూ.25 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని నేతన్నలు చెబుతున్నారు. ఇక నేత వస్త్రాలు, రంగు రసాయనాలపై జీఎస్టీని తొలగిస్తామని, కేంద్ర ప్రభుత్వం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని ఎన్నికల సమయంలో చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.
ఇంకా అమలు కాలేదు
చేనేత వస్త్రం తయారయ్యే వరకు అల్లులు పట్టడం, అచ్చులు అద్దడం, రాట్నంపై నూలు వడకడం, రంగులు అద్దడం, డిజైన్లు కట్టడం, పడుగులు చేయడం, మగ్గాల మరమ్మతులు, వస్త్రాలకు ఫినిషింగ్, గిరి పనులు వంటి అనేక ఉపవృత్తిదారుల శ్రమ ఉంటుంది. తొమ్మిది ఉపవృత్తుల్లో పనిచేసే వారిని చేనేత కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకొస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
ఉమ్మడి జిల్లాలో 2019 – 20లో : 4,110 మంది
జిల్లాల పునర్విభజన తర్వాత..
2020 – 21లో : 3,383 మంది
2021– 22లో : 3,316 మంది
2022 – 23లో : 3,639 మంది
2023 – 24లో : 3,817 మంది
కూటమి పాలనలో..
అర్హులు : 2,600 మంది మాత్రమే..


