ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని నేలటూరు పరిధిలో సీఆర్‌జెడ్ భూముల్లో కొత్తగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. సముద్రపు అంచున వీటిని నెలకొల్పి రొయ్యల చెరువుల కార్యకలాపాలను సాగించనున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సీఆర్‌జెడ్ నిబంధనల మేరకు ఆ ప్రాంతాల్లో రొయ్యల చెరువుల ఏర్పాటుకు అనుమతి లేదు. నేలటూరు పరిధిలోని ఈ భూముల్లో రొయ్యల చెరువులను స్థానికేతరులు అక్రమంగా తవ్వుతున్నారనే ఫిర్యాదులపై గతంలో ఫిషరీస్ శాఖ జేడీ, తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం పరిధిని గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రాంతంలో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు కావడం, సముద్రపు అంచున మోటార్లు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రొయ్యల చెరువులకు కనెక్షన్లను కొత్తగా ఇవ్వలేదని అధికారులు చెప్తున్నా, ట్రాన్స్‌ఫార్మర్లు ఎలా ఏర్పాటయ్యాయనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
నిబంధనలకు తూట్లు
గతేడాది డిసెంబర్‌లో కృష్ణపట్నం గ్రామ సచివాలయానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఆక్వా గుంతలను అక్రమంగా ఏర్పాటు చేస్తున్నా, పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఇక్కడ వివిధ రకాల పంటలను సాగు చేసుకొని జీవిస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకున్న కొందరు ఇక్కడ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టి ఎలాంటి అనుమతుల్లేకుండానే గుంతలను తీశారు. సుమారు వందడుగుల ఎత్తులో మట్టి కట్టలను నిర్మించి గుంతలను రూపొందించారు.
ఇవీ రూల్స్..
సీఆర్‌జెడ్ నిబంధనల మేరకు సముద్ర తీరానికి 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. తీరప్రాంతాల పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద ఈ చట్టాన్ని తెచ్చారు. అయితే నిబంధనలను తొంగలో తుక్కి యథేచ్చగా వంద మీటర్లలోపే రొయ్యల సాగు కోసం గుంతలను నిర్మిస్తున్నారు. బయటి ప్రాంతం నుంచి వచ్చి పట్టపగలే పనులు చేపట్టారు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు స్పందించి దీని పరిధిలో రొయ్యల సాగును ఎవరూ చేయకూడదంటూ జెండాలు పాతారు.
కనెక్షన్లను ఇవ్వలేదు..
తీర ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వ్యవహారాన్ని విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, కొత్తగా ఎలాంటి కనెక్షన్లను ఇవ్వలేదని చెప్తన్నారు. అయితే వీటిని ఎవరి అనుమతితో ఏర్పాటు చేశారు.. వాటికి విద్యుత్ ఎలా అందుతోందనే ప్రశ్నలకు మాత్రం సమాధానం రావడంలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగా వెలసిన ట్రాన్స్‌ఫార్మర్లు
రొయ్యల చెరువులకు విద్యుత్
కోసమేనాననే అనుమానాలు
గతంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
ఇప్పుడు మౌనంగా అధికారులు


