నెల్లూరు(అర్బన్): టీబీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. నగరంలోని అపోలో, డెల్టా ఆస్పత్రుల్లో డాక్టర్లతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. టీబీని పారదోలాల్సిన అవసరముందని చెప్పారు. ఇందులో భాగంగానే టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్రం రూపొందించిందని చెప్పారు. టీబీని నివారించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు తమ వంతు తోడ్పాటునందించాలని కోరారు. లక్షణాలున్న వారిని ప్రభుత్వ టీబీ ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. పరీక్షల్లో టీబీ నిర్ధారణైతే వారికి క్షయ మందులను ఉచితంగా అందజేయనున్నామని వెల్లడించారు. భవ్య ఫీల్డ్ కో ఆర్డినేటర్ అనూరాధ, జిల్లా కో ఆర్డినేటర్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.


