● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అధ్యక్షతన బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
● అనంతరం జిల్లా సైబర్ విభాగం ఆధ్వర్యంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే మోసాలు, ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్స్, ఫేక్ లోన్‌యాప్‌ల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డయల్ 112 కాల్స్‌కు సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎన్‌డీపీఎస్ కేసులు, డ్రగ్స్ నియంత్రణ, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రౌడీషీటర్లపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి గ్రామాల సందర్శనలు నిర్వహించాలన్నారు.
● జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ , హత్య, పోక్సో, ప్రాపర్టీ నేరాలు, వాహన దొంగతనాలు మిస్సింగ్, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికవరీలపై సమీక్ష నిర్వహించారు. గతనెలలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసుల అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. ● ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధి ప్రసన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
● జిల్లా వన్‌స్టాప్ సెంటర్ (సఖి) ప్రతినిధి షెహనాజ్ మహిళలపై జరిగే హింస, బాధితులకు అందించాల్సిన కౌన్సెలింగ్ తదితర అంశాల్లో ఎస్పీ చూపుతున్న చొరవను ప్రశసించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) సీహెచ్ సౌజన్య, అడిషనల్ ఎస్పీ ఏఆర్ అప్పారావు, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, వీవీ రమణకుమార్, గిరిధర్, చంద్రమోహన్, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


