నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘మేం పోలీసులం. ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి జైల్లో వేస్తాం’ అని ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వివరాలు.. ఈనెల 2వ తేదీన నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో మద్యం తాగిన ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని బెదిరించారు. ‘ఇక్కడ ఎందుకున్నావు.. నీపై అనుమానంగా ఉంది. కేసు పెట్టి జైల్లో పెడతాం’ అని చెప్పడంతో సదరు వ్యక్తి వారి నుంచి తప్పించుకుని పక్కరోజు చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో తోటపల్లిగూడూరు ప్రాంతానికి చెందిన గిరీష్, చందు, చిన్నారావును అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
హత్య కేసులో వ్యక్తి అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహిళను కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు కాకుమూరి శ్రీహరిని నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వేణు బుధవారం మట్టెంపాడు గ్రామంలో అరెస్ట్ చేశారు. ఆయన కథనం మేరకు.. మట్టెంపాడు సమీపంలో వెన్నెల అనే మహిళను శ్రీహరి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కోట మండలంలో కలెక్టర్ పర్యటన
కోట: మండలంలో ఉన్న ప్రభుత్వ, పట్టా భూములను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆరా తీశారు. బుధవారం మండలంలో కలెక్టర్ పర్యటించారు. కేశవరం, చిట్టేడు రెవెన్యూ పరిధిలోని భూముల వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యానగర్ సమీపంలో సాగరమాల రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం పుచ్చలపల్లి మార్గంలో వెళ్లి అక్కడ భూములను చూశారు. అయితే కలెక్టర్ పర్యటన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను కలెక్టర్‌కు నివేదించినట్లు అధికారులు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ జయజయరావు ఉన్నారు.
కండలేరులో 24.73 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 24.73 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


