● చిత్తూరు జిల్లాలో
అల్లూరువాసి మృతి
పూతలపట్టు(యాదమరి): రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాలవి. రోజూలాగే పని ముగిసింది. అలసిపోయిన శరీరంతో.. ఇంటి దగ్గర ఎదురుచూసే తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ప్రయాణమే చివరి మజిలీ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల పరిధి గాండ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన నాగరాజు (40) కొన్నినెలలుగా రంగంపేట క్రాస్‌లో నివాసముంటూ తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. అతడితోపాటు పూతలపట్టుకు చెందిన రాంబాబు (35) కూడా పనికి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం పనిముగించుకుని బైక్‌పై వస్తుండగా గాండ్లపల్లి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నాగరాజు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాంబాబు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


