● ఆక్రమించి దుర్భాషలాడుతున్న
కబ్జాదారుడు
● తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
సోమశిల: తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వదలడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందజేసిన స్థలాలను టీడీపీ నాయకుడు ఆక్రమించినట్లు బాధితులు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. అనంతసాగరం మండల పరిధిలోని ఇస్కపల్లి పంచాయతీలో ఉన్న శంకరనగరం గ్రామంలో గత ప్రభుత్వంలో సర్వే నంబర్ 163లో జగనన్న లేఅవుట్ –1 ఏర్పాటు చేశారు. అందులో గ్రామానికి చెందిన సుంకర లత, కుమార కామాక్షమ్మ, కె.నాగ లక్ష్మి, జయలక్ష్మి అనే నలుగురికి 1, 2, 3, 4 నంబర్లు గల ప్లాట్లను మంజూరు చేసి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. అయితే ఆ స్థలాలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మోదేపల్లి శ్రీహరి వరిగడ్డి వేసుకునేందుకు ఆక్రమించాడు. హద్దు రాళ్లను తొలగించి చదును చేసి కంచె వేశాడు. కూటమి అధికారంలో ఉండటంతో సదరు నేత నాలుగు ప్లాట్లను తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.
దిక్కున్నచోట చెప్పుకోండి
స్థలాల ఆక్రమణపై బాధితులు గురువారం ఇన్‌చార్జి తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ నేతను ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మమ్మల్ని ఏం చేయలేరు’ అంటూ బహిరంగంగానే దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి లేఅవుట్‌లో జరిగిన ఆక్రమణపై విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. తహసీల్దార్ స్పందిస్తూ ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. వీఆర్వోకు అప్పగించినట్లు చెప్పారు. అలాగే కంచెను తక్షణమే తొలగించాలని, స్థలంలో ఎటువంటి పనులు చేపట్టకూడదని శ్రీహరిని ఆదేశించామని తెలిపారు.


