పీఏసీఎస్ ఉద్యోగుల భారీ ర్యాలీ నేడు
● 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాని పీఏసీఎస్ ఉద్యోగులు మంగళవారం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం వారు నెల్లూరులోని డీసీసీ బ్యాంక్ వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక (జేఏసీ) ఇచ్చిన పిలుపుమేరకు గత శుక్రవారం దీక్షలు ప్రారంభించారు. వీటిలో 78 సంఘాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రామానాయుడు, కొండూరు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు మూడు నెలల నుంచి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పీఏసీఎస్‌ల పరిధిల్లో రైతులకు సేవలు నిలిచిపోయాయని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. మంగళవారం డీసీసీ బ్యాంక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధయ్య, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఖాజామస్తాన్, సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.


