విధుల బహిష్కరణ నేడు
నెల్లూరు(లీగల్): కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది ఎం.పవన్‌కుమార్‌పై అక్కడి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విక్రమ సింహ, కానిస్టేబుల్ మురళి చేసిన దాడికి నిరసనగా మంగళవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యపరెడ్డి, నక్కల నాగరాజ యాదవ్ తెలిపారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించామని వారు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.
రెవెన్యూ సిబ్బంది చేతివాటం
నెల్లూరు రూరల్: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని కొందరు రైతులు ఆరోపించారు. దగదర్తి మండలం దామవరం గ్రామానికి చెందిన రైతులు, ఐతా సురేష్ సోమవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దామవరంలో శాశ్వత లీజుదారుల నుంచి 418.14 ఎకరాలను సేకరించాలని జీఓ విడుదల చేశారన్నారు. కానీ కొంతమంది రెవెన్యూ అధికారులు దీనిని దుర్వినియోగం చేస్తూ అదనంగా మరో 28 ఎకరాల భూమిని శాశ్వత లీజుదారులుగా చేర్చారని విమర్శించారు. దీంతో కొందరు రైతులకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి లంచాలిచ్చి వాళ్లకి అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఒకటో బిట్‌లో 15 పేర్లు ప్రకటించకుండా 16వ పేరు నుంచి ప్రకటించి గ్రామసభ జరిపారన్నారు. 418 ఎకరాలకు సంబంధించి 390 ఎకరాలు మాత్రమే సేకరించారన్నారు. మిగిలిన 28 ఎకరాల భూమి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను అడిగినా న్యాయం చేయలేదన్నారు. ఆర్డీఓ వంశీకృష్ణ, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో రైతులు ఎ.సురేష్, హరీష్, చంద్రశేఖర్‌నాయుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బైక్‌ల చోరీ కేసులో
ఒకరికి ఏడాది జైలు
నెల్లూరు(లీగల్): నెల్లూరు నగరంలో మోటార్‌బైక్‌లు చోరీ చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో రూరల్ మండలం యలమవారిదిన్నె ప్రాంతానికి చెందిన కల్యాణ్ కుమార్‌కు శిక్ష పడింది. ఏడాది జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎల్.శారదారెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నెల్లూరు చిన్నబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2025 సంవత్సరంలో ఆరు బైక్‌లు, ఒక ఆటో చో రీ జరిగింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చే శారు. నెల్లూరు నవాబుపేట స్టేషన్ పరిధి లో ఒక బైక్ చోరీ జరిగిందని కేసు నమోదైంది. ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు దర్యాప్తు చేశారు. కల్యాణ్ కుమార్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేసి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది శిక్ష విధి స్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ లీలాకుమారి వాదించారు.
మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్ల కేటాయింపు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న 53 మందికి సీనియారిటీ ప్రాతిపదికన ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పి స్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 11 మంది డాక్టర్లు ప్రొఫెసర్లుగా రానున్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర మెడికల్ కళాశాలలో అనస్థీషియన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, ఎస్వీఎంసీలో పనిచేస్తున్న డా.శారద, డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, డాక్టర్ సునీత, డాక్టర్ శశికుమార్, ఒంగోలు మెడికల్ కళాశాల నుంచి డాక్టర్ చలపతి, విజయవాడలో ఎస్‌ఎంసీలో పనిచేస్తున్న డాక్టర్ భారతి, రాజమహేంద్రవరంలో జనరల్ సర్జన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ దుర్గాప్రసాద్, ఆర్థోపెడిక్ విభాగంలో అనంతపురం జీఎంసీలో పనిచేస్తున్న డాక్టర్ ఆనందబాబు, పీడియాట్రిక్ విభాగం నుంచి డాక్టర్ భాస్కర్‌నాయక్, కడప జీఎంసీ నుంచి డాక్టర్ రామమోహన్ను బదిలీ చేశారు. అలాగే నెల్లూరు మెడికల్ కళాశాల గైనకాలజీ విభాగం నుంచి డాక్టర్ భవానీని ఏలూరు మెడికల్ కళాశాలకు, ఆర్థోపెడిక్ డాక్టర్ మస్తాన్‌బాషాను ఒంగోలుకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు.
26న జిల్లా స్థాయి
క్రైస్తవ సమావేశం
నెల్లూరు(బృందావనం): ఈనెల 26వ తేదీన కొండాయపాళెంలో ఉన్న జీసస్ చర్చిలో (ఓల్డ్ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ ప్రాంగణం) జిల్లా స్థాయి క్రైస్తవ సమావేశం జరుగుతుందని నెల్లూరు బాప్టిస్ట్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రెవరెండ్ రాజశేఖర్ దాసరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చీస్ (ఎఫ్‌టీసీ), ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చీస్ (ఏపీఎఫ్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి క్రైస్తవ సంఘ నాయకులు వస్తారన్నారు. జిల్లాలోని ఆర్సీఎం, బాప్టిస్ట్, సీఎస్‌ఐ, ఎస్‌ఏఎల్‌సీ, సాల్వేషన్ ఆర్మీ, ఎల్‌ఈఎఫ్, ఇండిపెండెంట్ చర్చిల నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున పాల్గొనాలని కోరారు.


