దివ్యాంగుల సంక్షేమం గాలికి..
నెల్లూరు(దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని నేతలు అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను త్వరగా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర, నగరాధ్యక్షుడు షేక్ సుభాని తదితరులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. నాగేంద్ర మాట్లాడుతూ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని విభాగాల్లో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థి లేకపోతే వేరే అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 7 వరాల ఇంద్రధనస్సు పథకాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని, పలు రకాల హామీలు ఇచ్చారన్నారు. చిత్తశుద్ధి ఉంటే హామీలను నెరవేర్చాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. సుభాన్‌బాషా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు సాదు పెంచల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మూడు చక్రాల మోటార్ వాహనాలను ఉచితంగా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో దొంతల లత, కొత్తపల్లి అచ్చమ్మ, గాండ్ల శివ, ఎండీ షాహుల్ హమీద్, రమణయ్య, షబ్బీర్, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు.


