మత్స్యశాఖ మెరుపు దాడులు
● 9 డ్రమ్ముల చికెన్ వ్యర్థాల స్వాధీనం
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని దామరమడుగు, కాగులపాడు గ్రామాల్లో సోమవారం మత్స్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు అందిన సమాచారంతో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ చాంద్‌బాషా సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. తొమ్మిది మంది రైతులు తమ చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 9 డ్రమ్ముల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు చెరువులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. నిబంధనలు ఉల్లంఘించిన రైతులకు జరిమానా విధించారు. అక్రమంగా వ్యర్థాలను వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ కొందరు చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు చెప్పారు. దాడుల్లో మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారుల దాడులతో మండలంలోని మిగిలిన చేపల సాగుదారులు ఉలిక్కిపడ్డారు.


