
రూ.4 కోట్ల చావిడి స్థలానికి ఎసరు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పొదలకూరు పట్టణ నడిబొ డ్డున పోలీస్ స్టేషన్, బిట్–2 సచివాలయం బిల్డింగ్ మధ్యలో ఉన్న రూ.4 కోట్ల విలువైన 34 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసేందుకు ఆ వ్యక్తి విఫలయత్నమయ్యాడు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చివరి నిమిషంలో రికార్డుల పరిశీలనలో ఈ విషయం తెలియడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సదరు తహసీల్దార్ తనకు స్వయాన బావమరిది అయిన వ్యక్తితో కలిసి ప్రభుత్వ భూమిని కాజేసే కుట్రకు బరి తెగించాడు. ప్రభుత్వ స్థలాన్ని తన బావమరిదికి కట్టబెట్టేందుకు ఆ స్థలాన్ని పిత్రార్జితంగా మార్చేందుకు డెత్ సర్టిఫికెట్లతో నకిలీ పత్రాలను సృష్టించారు. అయితే డాక్యుమెంట్లు నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్న వైనం తాజాగా బయటపడింది.
దశాబ్దాలుగా చావిడి స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో
పోలీస్‌స్టేషన్ పక్కనున్న సర్వే నంబరు 191– 1ఏ లోని 34 అంకణాల స్థలం దశాబ్దాలుగా రెవె న్యూ రికార్డుల్లో గ్రామ చావిడి భూమిగా ఉంది. ప్రస్తు తం ఈ స్థలం విలువ బహిరంగ మార్కె ట్లో రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. దాదాపు పదేళ్ల క్రితం వరకు ఇక్కడ చావిడి ఉండేది. ఈ స్థలంలో వీఆర్వోలు తమ విశ్రాంతి గదులను నిర్మించుకునేందుకు ప్రయత్నించడంతో అప్పట్లో పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ స్థలం రెవెన్యూదా? లేక పంచాయతీరాజ్‌దా? తేల్చుకునేందుకు రెండు శాఖల అధికారులు పెద్ద కసరత్తు కూడా చేశారు. స్థల వివాదంపై అప్పట్లో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవిశేఖర్, అప్పటి సర్పంచ్ నిర్మలమ్మ, ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య మధ్య వివాదం నెలకొని పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడంతో అక్కడ రెవెన్యూ భవనం నిర్మించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో భవనం నిర్మించుకునేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు కూడా పొందారు.
పిత్రార్జితమంటూ రంగంలోకి..
అయితే పట్టణానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి ఆ స్థలం తమ పిత్రార్జితమని 2023 సెప్టెంబరులో రంగంలోకి దిగాడు. డెత్ సర్టిఫికెట్లు తయారు చేసుకుని ఆ స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్లను సమర్పించాడు. సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అనుమా నం వచ్చి నిలిపివేశారు. అయితే విజయకుమార్ ఎలాగైనా విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని వెంటనే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి విలువైన స్థలాన్ని కాపాడాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌కు విఫలయత్నం
ఆ స్థలం గ్రామ చావిడిగా
దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో..
న్యాయపరమైన చిక్కులు లేకుండా తిరుపతి జిల్లా తహసీల్దార్ సలహాలు
సదరు అధికారి అండదండలతో స్థలం కబ్జాకు కుయుక్తులు