
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
వరికుంటపాడు: ఖాళీ భూములు కనిపిస్తే అంగబలం, ఆర్థిక బలం ఉన్నోళ్లు విలువైన ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. తాజాగా మండలంలోని తూర్పుబోయమడుగుల అలివేలు మంగాపురం రెవెన్యూ పరిధిలో బీసీ కాలనీకి ఆనుకొని తారురోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 140, 141లోని విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం భూమి రూ.5 లక్షలపైమాటే. స్థానికేతరుడైన పావూలూరి మాల్యాద్రి అనే వ్యక్తి ఇటీవల ఈ భూమికి పక్కనే కొంత భూమిని కొనుగోలు చేశాడు. తాజాగా దాని పక్కనే ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మంగళవారం జేసీబీలతో ముళ్లచెట్లు తొలగిస్తూ, భూమిని చదును చేశారు. మండల రెవెన్యూ అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతల సహ కారం లేకుండా అతను ఇంత సాహసం చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకు ఈ విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘మేము ఇక్కడ పుట్టి పెరిగినా మా గ్రామంలో మాకు ఒక్క గజం భూమి కూడా లేదు. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి తనకు ఉన్న భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఆక్రమించడం అన్యాయం అని మండిపడ్డారు. భూ ఆక్రమణపై గ్రామస్తులు రెవెన్యూ సిబ్బందికి తీసుకెళ్లినా కనీసం స్పందించి అటువైపు కూడా రాలేదు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కబ్జాను ఆపి ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అడ్డుకున్న గ్రామస్తులు,
కనిపించని రెవెన్యూ అధికారులు