సైదాపురం పోలీసుల అష్టదిగ్బంధం
సైదాపురం: సైదాపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సైదాపురాన్ని అష్టదిగ్బంధం చేశారు. శ్రీనివాస పద్మావతి గని వద్ద అనిల్‌కుమార్ యాదవ్ మంగళవారం నిరసన వ్యక్తం చేయనున్నట్టు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ అలర్ట్ అయ్యారు. ఆయన పర్యవేక్షణలో సుమారు 100 మంది వరకు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో సైదాపురంలో ఉత్కంఠ నెలకొంది. సైదాపురం నుంచి శ్రీనివాస పద్మావతి గని వరకు అడుగడుగున పోలీసులు మోహరించారు. మహిళా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. తీరా మాజీమంత్రి రావడం లేదని సమాచారం అందడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


