టౌన్ బస్సుల ఇష్టారాజ్యం
● నిబంధనలు పాటించని యాజమాన్యాలు
● ఒక రూట్‌కు పర్మిట్..
తిరిగేది మరో రూట్‌లో..
● నిత్యం ట్రాఫిక్‌కు ఆటంకం
● బస్సులను శుభకార్యాలకు
పంపిస్తున్న వైనం
● కండీషన్ కూడా అంతంతమాత్రమే
● పట్టించుకోని పోలీస్,
రవాణా అధికారులు
నెల్లూరు నగరంలో టౌన్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని భారీ శబ్దం చేసే హారన్లతో మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రవాణా అధికారులు మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నెల్లూరు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలో 90 రూట్ పర్మిట్లలో 90 బస్సులు తిరగాల్సి ఉంది. 60 మాత్రమే తిరుగుతున్నాయి. ఈ రంగంలోకి కొత్తవారు వస్తే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతరులు రాకుండా గతంలో పర్మిట్ తీసుకున్న వారే కొత్తగా రూటు పర్మిట్లు తీసుకుంటున్నారని తెలిసింది. టౌన్ బస్సులను తిప్పుకొనేందుకు రవాణా అధికారులు రూట్ మ్యాప్, సమయాన్ని కేటాయిస్తారు. పర్మిట్ తీసుకున్న రూట్‌లో నిర్దేశించిన సమయానికి బస్సును తిప్పాలి. వీటి కాలపరిమితి ఐదేళ్లపాటు ఉంటుంది. డ్రైవర్‌తోపాటు కండక్టర్‌కు లైసెన్స్ తప్పనిసరి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదు. వాహనం కండీషన్‌లో ఉంచాలి. హెవీ హారన్లు, ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించకూడదు. ప్రతి ఏడాది ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొందాలి. అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తప్పనిసరిగా బస్సులో ఉంచాలి.అనుమతించిన రూట్‌లోనే తిప్పాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు తిప్పకూడదు.
మూణ్ణాళ్ల ముచ్చటగా జీపీఎస్
టౌన్ బస్సుల నిర్వాహకుల ఆగడాలపై రవాణా శాఖతోపాటు కలెక్టర్‌కు సైతం అనేక ఫిర్యాదులందాయి. ఈ ఏడాది ప్రారంభంలో రవాణా అధికారులు టౌన్ బస్సులకు జీపీఎస్‌ను అమర్చారు. రవాణా కార్యాలయంలో మానిటర్‌ను పెట్టారు. బస్సులు అనుమతించిన రూట్, నిర్దేశించిన సమయంలో తిప్పుతున్నారా.. లేదా.. అని పర్యవేక్షించారు. ఆ తర్వాత ఏమైందో గానీ జీపీఎస్‌ను యజమానులు తొలగించారు. అధికారులు అడగకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. పర్మిట్ రూట్‌లో కాకుండా ఎవరికి నచ్చిన రూట్‌లో వారు నడుపుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లలో బస్సులను కాంట్రాక్ట్ పద్ధతిన తిప్పుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు లైసెన్స్ లేకుండా తిప్పుతున్నా అడిగే వారు లేకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోయాయి. స్టాప్‌లో కాకుండా ఎక్కడపడితే అక్కడ నిలుపుతూ ట్రాఫిక్‌కు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారు. పోలీసులు సైతం టౌన్ బస్సుల నిర్వాహకుల దగ్గర నెలవారీ మామూళ్లు పుచ్చుకుని మిన్నకుంటున్నారనే విమర్శలున్నాయి.
పేరుకే రవాణా స్క్వాడ్
పర్మిట్లు ఇచ్చిన రూటులో కాకుండా వేరే రూట్‌లో తిరిగితే రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అదనంగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.300 అపరాధ రుసుం వేయొచ్చు. కానీ రవాణా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలో ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో స్క్వాడ్ విభాగం ఉంది. వీరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించే వాహనాలపై కేసులు నమోదు చేయాలి. నగర ప్రజల నుంచి టౌన్ బస్సులపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా ఆ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భాల్లేవు. వీరు జాతీయ రహదారిపై తనిఖీలకే మొగ్గు చూపుతున్నారు. అక్కడైతే నిబంధనలు అతిక్రమించే వాహనదారుల నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని వదిలివేయొచ్చు. అదే నెల్లూరు నగరంలో అయితే తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి. అందువల్లే టౌన్ బస్సులు నిబంధనలు అతిక్రమిస్తున్నా కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా తనిఖీలు నిర్వహించి టౌన్ బస్సుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
టౌన్ బస్సుల ఇష్టారాజ్యం
టౌన్ బస్సుల ఇష్టారాజ్యం


