విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ

Dec 31 2025 8:34 AM | Updated on Dec 31 2025 8:34 AM

విద్య

విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ

నెల్లూరు(టౌన్‌): అల్లూరు మండలం గొల్లపాళెంలోని చైల్డ్‌ ఆశ్రమ స్కూల్లో జిల్లాలోని 46 పీఎంశ్రీ పాఠశాలల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఇస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. శిక్షణ ఇచ్చేందుకు గ్రాంట్స్‌ను విడుదల చేశారు. గైడ్స్‌కు యూనిఫాం అందజేశారు. శిక్షణ తీసుకున్న వారికి సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏఎల్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్‌బాబు, ట్రెజరర్‌ మురళీధర్‌, ఎంఈఓ మురళీధర్‌, ట్రైనర్‌ కమల్‌ కన్నన్‌, ఆశ్రమ నిర్వాహకులు రామచంద్రశరత్‌, విజయప్రదీప్‌, ప్రభాకర్‌, శాంసన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్‌

మృతదేహం లభ్యం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

సంగం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన తురకా పవన్‌ (34) మృతదేహాన్ని మర్రిపాడు వద్ద కాలువలో మంగళవారం గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంగం ప్రాంతానికి చెందిన పవన్‌ ఆటో నడుపుతుంటాడు. అతడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారులున్నారు. కుటుంబంలో ఏం జరిగింది ఏమో గానీ ఈనెల 26వ తేదీన పవన్‌ ఇంటి నుంచి అదృశ్యమైనట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి ఉడ్‌హౌస్‌పేట సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువలో ఆటో లభ్యమైంది. అప్పట్నుంచి అతని కోసం గాలిస్తున్నారు. బెజవాడ పాపిరెడ్డి కాలువలో మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై రాజేష్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని విషయం చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పవన్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలేరమ్మ ఆలయంలో చోరీ

కలువాయి(సైదాపురం): కలువాయి ఎస్సీ కాలనీలోని పోలేరమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుడి నిర్వహణ చేసేందుకు పోలయ్య మంగళవారం ఉదయం వెళ్లగా తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు సీసీ కెమెరాల వైర్‌ను కట్‌ చేసి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి మెడలోని 8 గ్రాములు బంగారు తాళిబొట్టు, కాసులు, హుండీలోని సుమారు రూ.20 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు పోలయ్య తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ

వృద్ధుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంతపేట మాగుంట నగర్‌లో షేక్‌ మీరా మొహిద్దీన్‌ (54) నివాసముంటున్నాడు. ఆయన భార్య చనిపోవడంతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపానికి గురైన మొహిద్దీన్‌ ఈనెల 26వ తేదీన ఇంట్లో ఫినాయిల్‌ తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎస్సై సుల్తాన్‌బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నుంచి కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు

నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు పంపిణీ చేయనున్నామని కలెక్టర్‌ హిమాన్లు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు.

కండలేరులో నీటి నిల్వ

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 60.880 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్‌ కాలువకు 50, హైలెవల్‌ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

విద్యార్థులకు  సర్టిఫికెట్ల పంపిణీ1
1/1

విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement