గృహ నిర్మాణాల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ
● ఆ శాఖ మేనేజింగ్
డైరెక్టర్ అరుణ్‌బాబు
నెల్లూరు(దర్గామిట్ట): పేదల గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్షన్ – 3 కింద నిర్మించిన ఇళ్లల్లో నాణ్యతగా లేనివాటిని గుర్తించి లోటుపాట్లను వెంటనే సరిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జిల్లాలో సుమారు 6,899 ఇళ్లల్లో శ్లాబులు, గోడ నిర్మాణాలు, బేస్‌మెంట్లు నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందించాలన్నారు. జిల్లాకు కేటాయించిన 27,820 ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలన్నారు. నూతనంగా పీఎంఏవై 2.0లో మంజూరైన ఇళ్లను మొదలు పెట్టించాలన్నారు.
పోటీతత్వంతో పనిచేయండి
కలెక్టర్ మాట్లాడుతూ ఉగాదిలోగా జిల్లాకు కేటాయించిన ఇళ్లను పూర్తి చేసేందుకు అధికారులందరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పోటీతత్వంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో ఆ శాఖ అధికారులు మోహన్‌రావు, మాధవరావు, ఏఈలు, డిజిటల్ అసిస్టెంట్లు, వివిధ ఏజెన్సీల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


