డయల్ 100కు కాల్ చేసినా..
సివిల్ పోలీసులు తమ స్టేషన్ పరిధిలో ఆ సమయంలో గస్తీలో ఉంటారు. కనీసం అల్లూరురోడ్డు స్టేషన్ మాస్టర్ డయల్ 100కు కాల్ చేసి తన స్టేషన్ పరిధిలో సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగింది. ఇది దోపిడీ దొంగల పనై ఉంటుందని సమాచారం ఇచ్చినా ఈ స్టేషన్‌కు ఐదు కి.మీ. దూరంలో దగదర్తి, 10 కి.మీ. దూరంలో బిట్రగుంట, అంతే దూరంలోని అల్లూరు, 20 కి.మీ. దూరంలో కొడవలూరు పోలీసులు నాలుగు వైపులా చుట్టుముట్టే అవకాశం ఉండేది. బిట్రగుంటలోనే జీఆర్పీ అవుట్ పోస్టు సిబ్బంది ఉన్నారు. ఇక పడుగుపాడు స్టేషన్ విషయానికి వస్తే కూతవేటు దూరంలోనే కోవూరు పోలీస్‌స్టేషన్ ఉంది. సమీపంలో నెల్లూరు నగరంలో ఆరు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది గస్తీలో ఉంటారు. నెల్లూరులోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సైతం క్షణాల్లో వచ్చేందుకు అవకాశాలు ఉండేవి. అల్లూరురోడ్డు వద్ద దోపిడీకి గురైన మదురై ఎక్స్‌ప్రెస్ పడుగుపాడు స్టేషన్ వద్ద సిగ్నల్ ట్యాంపర్ చేసి దుండగులు దిగిపోయి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. పడుగుపాడు స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అయి ఉంటే.. దుండగులను పట్టుకునే అవకాశం ఉండేది. మొత్తం మీద రైల్వేస్టేషన్ మాస్టర్ల నిర్లక్ష్యం, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.


