టీ20 ఫార్మాట్‌లో పాక్‌పై తొలి విజయం నమోదు

Zimbabwe Registers First Ever Win Against Pakistan In T20 Format - Sakshi

హరారే: చాలాకాలం తరువాత తమకంటే మెరుగైన ప్రత్యర్ధిపై జింబాబ్వే విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో పాక్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో టీ20లో 19 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్ధిని కనీసం మూడంకెల స్కోర్‌ కూడా చేయనీయకుండా ఆలౌట్‌ చేసింది. మీడియం పేసర్‌ ల్యూక్‌ జాంగ్వే(4/18) అద్భుతంగా బౌల్‌ చేసి కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడంతో పాక్‌కు పసికూన చేతిలో పరాభం తప్పలేదు. వివారాల్లోకి వెళితే.. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కమున్హుకమ్వే 34 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. 

పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ హస్నైన్‌ 2 వికెట్లు, దనిష్‌ అజీజ్‌ 2, ఫహీమ్‌ అష్రాఫ్‌, అర్షద్‌ ఇక్బాల్‌, హరిస్‌ రవూఫ్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదన చేసేందుకు బరిలోకి దిగిన పాక్‌.. బ్యాట్స్‌మెన్ల ఘోర వైఫల్యం కారణంగా 99 పరుగులకే చాపచుట్టేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(45 బంతుల్లో 41; 5 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(18 బంతుల్లో 13), దనీష్‌ అజీజ్‌(24 బంతుల్లో 22; ఫోర్‌) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌నైనా చేయలేకపోయారు.

జింబాబ్వే బౌలర్లలో జాంగ్వేకు తోడుగా ర్యాన్‌ బర్ల్‌(2/21), రిచర్డ్‌(1/10), ముజరబాని(1/24) రాణించడంతో పాక్‌ ఓటమిపాలైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు రనౌటయ్యారు. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను జింబాబ్వే 1-1తో సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో పాక్‌ గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు విజయం సాధించింది. సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ ఆదివారం(ఏప్రిల్‌ 25) జరుగనుంది. 
చదవండి: ఆ విధ్వంసానికి ఎనిమిదేళ్లు.. నేడు మళ్లీ రిపీటయ్యేనా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top