సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌ | ZIM VS SA 1st Test: Keshav Maharaj Becomes The First South African Spinner To Take 200 Test Wickets | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌

Jun 29 2025 5:22 PM | Updated on Jun 29 2025 6:03 PM

ZIM VS SA 1st Test: Keshav Maharaj Becomes The First South African Spinner To Take 200 Test Wickets

సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్‌ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్‌ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్‌ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్‌ బౌలర్లే. 

సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్‌ బౌలర్‌గా కేశవ్‌ మహారాజ్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్‌ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ వికెట్‌ కేశవ్‌కు 200వ టెస్ట్‌ వికెట్‌. 

కేశవ్‌ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్‌ (170), పాల్‌ ఆడమ్స్‌ (134), పాల్‌ హ్యారిస్‌ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్‌ స్టెయిన్‌ (439) ఉన్నాడు. 

అతని తర్వాత షాన్‌ పోలాక్‌ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్‌ (330), మోర్కెల్‌ (309), కల్లిస్‌ (291), ఫిలాండర్‌ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్‌ బౌలర్లే.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్‌ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 

బ్రియాన్‌ బెన్నెట్‌ (19) రిటైర్డ్‌ హర్ట్‌ కాగా.. కైటానో 0, వెల్చ్‌ 4, క్రెయిగ్‌ ఎర్విన్‌ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్‌ విలియమ్స్‌ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్‌ 2, కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ తీశారు.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153), కార్బిన్‌ బాష్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement