నా కుమారుడు క్రికెటర్‌ కావాలని కోరుకోను.. ఎందుకంటే..: యువీ | Yuvraj Singh Doesn't Want His son to follow in his footsteps, Reveals Why? | Sakshi
Sakshi News home page

నా కుమారుడు క్రికెటర్‌ కావాలని కోరుకోను.. ఎందుకంటే?: యువీ

May 11 2025 4:57 PM | Updated on May 11 2025 5:09 PM

Yuvraj Singh Doesn't Want His son to follow in his footsteps, Reveals Why?

టీమిండియా మేటి క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) ఒకడు. అద్భుత ఆటతీరుతో ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌-2007 (T20 WC 2007), వన్డే వరల్డ్‌కప్‌-2011 (ODI WC 2011) గెలవడంలో యువీది కీలక పాత్ర.

నాటి ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శన చేసిన యువీ.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. మొత్తంగా తన కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 3277, 9924, 863 పరుగులు సాధించాడు.

అంతేకాదు.. ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ యువ తరం ఆటగాళ్లకు అభిమాన క్రికెటర్‌గా కొనసాగుతున్న యువీ..తన కుమారుడిని మాత్రం క్రికెటర్‌ని చేయాలనుకోవడం లేదట!

నా కుమారుడు క్రికెటర్‌ కావాలని కోరుకోను
కామియా జానీతో ఇటీవల జరిపిన సంభాషణ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘మా కొడుకు క్రికెట్‌ ఆడటం నాకైతే ఇష్టంలేదు. ఒకవేళ తాను క్రికెటర్‌ కావాలని కోరుకుంటే మాత్రం నేను అడ్డుచెప్పను.

ఎందుకంటే.. ప్రస్తుత సమాజంలో ఓ పిల్లాడు క్రికెట్‌ ఆడుతున్నాడంటే అతడిపై భరించలేనంత ఒత్తిడి పడుతోంది. ఇక చాలా మంది పిల్లల్ని వాళ్ల నాన్నలతో పోలుస్తూ.. వారసత్వాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు.

ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్‌
నిజానికి అది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రంగంలో ప్రతిభ ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అదే విధంగా అందరూ సమానంగా రాణించాలనీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్‌ ఉంటుంది. కాబట్టి ఎవరి అభీష్టాలకు అనుగుణంగా వారు ఎదిగేలా ప్రోత్సహిస్తే మంచిది’’ అని యువీ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేసిన యువరాజ్‌ సింగ్‌ .. శుబ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ వంటి పంజాబీ యువ సంచలనాలకు మెంటార్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 132 మ్యాచ్‌లు ఆడిన యువీ 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ముచ్చటైన కుటుంబం
ఇక యువీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నటి హాజిల్‌ కీచ్‌తో చాన్నాళ్లు ప్రేమలో ఉన్న అతడు 2017, నవంబరు 30న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2022లో మొదటి సంతానంగా కుమారుడు ఓరియోన్‌ జన్మించాడు. ఇక రెండో సంతానంగా కుమార్తె జన్మించగా ఆమెకు ఆరా అని నామకరణం చేశారు.

చదవండి: Smriti Mandhana: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్‌.. సరికొత్త చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement